కోవిడ్-19 ఎఫెక్ట్: గల్ఫ్ లోని 7.5 లక్షల మంది తెలంగాణ, ఏపీ కార్మికుల ఉద్యోగాలకు ముప్పు
- April 14, 2020
ఉభయ తెలుగు రాష్ట్రాల గల్ఫ్ ప్రవాసులు సంవత్సరానికి పన్నెండున్నర వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోనున్నారని ఒక అంచనా!
అరబ్ గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూ.ఏ.ఈ , కువైట్, ఓమాన్, ఖతార్, బహ్రెయిన్ అనే ఆరు దేశాలలో 87,64,829 మంది ప్రవాస భారతీయులున్నారని పార్లమెంటులో భారత ప్రభుత్వం అధికారిక లెక్కలను ప్రకటించింది. వీరిలో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ చెందినవారు కలిపి 30 లక్షలు (మొత్తం భారతీయుల్లో 34 శాతం) మంది ఉంటారని ఒక అంచనా. ప్రస్తుత కరోనా సంక్షోభం వలన గల్ఫ్ లోని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రవాసులు ఏడున్నర లక్షల (మొత్తం తెలుగు ప్రవాసుల్లో 25 శాతం) మంది ఉద్యోగాలు కోల్పోయి దశలవారీగా రాబోయే ఆరునెలల కాలంలో స్వరాష్ట్రాలకు వచ్చే అవకాశమున్నది. ఈ లెక్కన మనవారు ప్రతిరోజూ 4 వేలమంది చొప్పున నెలకు ఒక లక్షా 20 వేల మంది హైదరాబాద్, చెన్నయి, బెంగళూరు, ముంబయి తదితర విమానాశ్రయంలో దిగే అవకాశమున్నది.
ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ మరియు ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ సంస్థలు కలిసి ప్రముఖ గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి నేతృత్వంలో అందుబాటులో ఉన్న నిపుణులతో తేది: 13.04.2020 న ఆన్ లైన్ లో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించి ఈ రిపోర్టును తయారు చేశారు. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, పరిస్థితులకు అనుగుణంగా వాస్తవంలో కొద్దిగా మార్పు ఉండే అవకాశం ఉండవచ్చు.
ఒక గల్ఫ్ కార్మికుడు సరాసరిగా సుమారు 700 దిర్హాములు / రియాల్స్ (రూ. 14,000) ఇంటికి పంపిస్తాడు అనుకుంటే... వాపస్ వస్తారని అంచనా వేస్తున్న ఏడున్నర లక్షల మంది నెలసరి సంపాదన రూ. 1,050 కోట్లు (సంవత్సరానికి 12,600 కోట్లు) ఉభయ రాష్ట్రాల ప్రవాసీ సమాజం నష్టపోనున్నది.
గత 30 ఏళ్లుగా వాపస్ వస్తూనే ఉన్నారు
అకస్మాతులుగా ఉద్యోగాలు ఊడిపోయి గల్ఫ్ నుండి వాపస్ రావడం మనకు కొత్తేమి కాదు. 1990-91 లో గల్ఫ్ యుద్ధం (కువైట్ పై ఇరాక్ దురాక్రమణ) నుండి నేటి కోవిడ్-19 వరకు గత ముప్పయి ఏళ్లలో రకరకాల కారణాల వలన ఉద్యోగాలు ఊడిపోయి వాపస్ వస్తూనే ఉన్నారు. అక్రమ నివాసులకు 'క్షమాబిక్ష' (ఆమ్నెస్టీ) పథకం, ముడి చమురు ధరల పతనం, ప్రపంచ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల స్థానికీకరణ (సౌదీలో నితాఖత్ లాంటివి), కంపెనీలు దివాళా తీయడం, ఇరాక్, లిబియా, యెమన్ లాంటి దేశాలలో అంతర్గత ఉద్యమాలు, యుద్ధ వాతావరణం తదితర ఎన్నో కారణాల వలన మనవారి ఉపాధికి గండి పడుతూనే ఉన్నది.
గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం, పునరేకీకరణ (రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, రీఇంటిగ్రేషన్) పథకాలను రూపొందించాలి. ఇందుకోసం కేరళ తరహాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఏపీ ఎన్నార్టీఎస్ సంస్థ ప్రవాసుల సంక్షేమానికి పాటుపడుతున్నది, తెలంగాణలో గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాల్సిన అత్యవసరం ఉన్నది. వాపస్ వచ్చేవారు కొంత నైపుణ్యం, అనుభవంతో వస్తారు, కొందరి వద్ద కొద్దో గొప్పో పెట్టుబడి సామర్థ్యం కూడా ఉంటుంది, వీరి సేవలను రాష్ట్రాల పునర్నిర్మాణానికి చక్కగా వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు