అబుధాబి :$500 లులు ఫ్రీ కూపన్లు అంటూ తప్పుడు ప్రచారం..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన CCO

- April 15, 2020 , by Maagulf
అబుధాబి :$500 లులు ఫ్రీ కూపన్లు అంటూ తప్పుడు ప్రచారం..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన CCO

యూ.ఏ.ఈ:లులు హైపర్ మార్కెట్స్ ప్రజలకు 500 డాలర్ల ఉచిత కూపన్లు అందిస్తోన్న ప్రచారాన్ని చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ వి.నందకుమార్ కొట్టిపారేశారు. తాము ఎలాంటి కూపన్ ఆఫర్లు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు లులు హైపర్ మార్కెట్స్ 500 డాలర్ల ఉచిత కూపన్లు అందిస్తోందంటూ ఆన్ లైన్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. లులు మార్కెట్ బ్రాండ్ తో ప్రజలను చీట్ చేసేందుకు కొందరు నకిలీగాళ్లు ఏకంగా http://lulu.bpromos.net పేరుతో నకిలీ వెబ్ సైట్ నే రూపొందించారు. ప్రజలను తేలిగ్గా ఆకట్టుకునేలా ఇందులో ప్రశ్నలు అడుగుతున్నారు. లులు బెస్ట్ హైపర్ మార్కెట్ అని మీరు భావిస్తున్నారా? లులు హైపర్ మార్కెట్ ను మీరు మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు రిఫర్ చేస్తారా? లాంటి చాలా తేలికైన ప్రశ్నలతో టెంప్ట్ చేస్తారు. సమాధానాలు చెప్పగానే తర్వాతి టార్గెట్ గా వాట్సాప్ లో ఐదు గ్రూపులకు గానీ, 20 మంది స్నేహితులకు లులు హైపర్ మార్కెట్ రిఫర్ చేయాలని షరతు విధిస్తారు. మెసేజ్ చేయగానే 500 డాలర్ల కూపన్ అందుతుందని, దాంతో హైపర్ మార్కెట్ లో షాపింగ్ చేయవచ్చని, ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేసే అప్షన్ ఉందని మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.

అయితే..500 డాలర్ల కూపన్లు అందిస్తున్నట్లు లులు హైపర్ మార్కెట్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సీసీవో నందకుమార్ తెలిపారు. తమ మార్కెట్స్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఉన్నా..తమ అధికారిక సోషల్ మీడియాలో చెక్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఇదిలాఉంటే అబుధాబి పోలీసుల పేరుతో కూడా ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు. అబుధాబి పోలీస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని, Dh3000 చెల్లించకుంటే ల్యాప్ టాప్, కంప్యూటర్స్ సీజ్ చేస్తామంటూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని వెల్లడించారు. అలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబుధాబి  పోలీసులు, అబుధాబి డిజిటల్ అధికారులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com