గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికులకు జీవనోపాధి కల్పించాలి--చంద్రబాబు

- April 22, 2020 , by Maagulf
గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికులకు జీవనోపాధి కల్పించాలి--చంద్రబాబు

అమరావతి:గల్ఫ్ దేశాలు, అందులోనూ ప్రత్యేకంగా కువైట్ దేశం సెమి స్కిల్డ్ మరియు అన్ స్కిల్డ్ వలస కార్మికుల ఉపాధికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ భయాందోళనల కారణంగా దేశాలన్నీ పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ఉద్యోగులు, ప్రత్యేకించి వలస కార్మికులు ఉద్యోగాలను కోల్పోయారు. అంతేకాకుండా ఆయా దేశాలు వలస కార్మికులను స్వదేశాలకు వెనక్కి పంపేందుకు సిద్దంగా ఉన్నాయి.

భారతీయ కార్మికులను స్వదేశానికి వెనక్కి పంపే ప్రక్రియలో నిమగ్నమైన ఆయా దేశాలలో కువైట్ కూడా ఒకటి. అందులో భాగంగానే కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ వ్యవహారాల శాఖ తమదేశంలో వర్క్ పర్మిట్లు లేకుండా, ఎక్స్ పైర్ అయిన పర్మిట్లతో, వీసాలతో అక్కడే నివసిస్తున్న వారందరికీ ఉచిత విమాన టిక్కెట్లు సమకూర్చి స్వదేశాలకు వెళ్లేలా క్షమాభిక్ష ప్రకటించింది. దాదాపు 15వేల మంది భారతీయులు ఈ క్షమాభిక్ష వినియోగించుకోడానికి ముందుకు వచ్చారు. ఈ బహిష్కరణ శిబిరాలలో దాదాపు 3వేలమంది తెలుగువారు ఉండగా, మరో 2వేల మంది తెలుగువారు తాత్కాలిక పాస్ పోర్ట్ లకు దరఖాస్తు చేశారు.  

ఈ నేపథ్యంలో కువైట్ నుంచి తరలివచ్చేవారి భద్రత మరియు జీవనోపాధి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. మొదటిగా, భారతదేశానికి రావాలని కోరుకునేవారంతా తప్పనిసరిగా కోవిడ్ వైరస్ ప్రభావానికి గురికానివారై ఉండాలి. రెండవది, వారు భారతదేశానికి రాగానే మళ్లీ పరీక్షించి, వారంతా కోవిడ్ సోకనివారిగా ధ్రువీకరించుకోవాలి. స్వదేశం చేరాక వాళ్లంతా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం వారికి సరైన రవాణా సదుపాయం కల్పించి స్వగృహాలకు చేరుకునేలా చూడాలి.  

స్వదేశానికి వారి తిరిగిరాకలో కీలకాంశం ఉపాధి కాబట్టి వాళ్లందరికీ  జీవనోపాధి మరియు పునరావాసం కల్పించి వాళ్లు మళ్లీ తమకాళ్ల మీద తాము నిలబడేలా చేయాల్సివుంది. కాబట్టి వారికి కావాల్సిన నిత్యావసరాలు మరియు వైద్య సహాయం అందజేయాలి.  మన దేశానికి తిరిగివచ్చిన వారికి స్థానికంగా జీవనోపాధి వెదుక్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలలో శిక్షణ అందించాలి. 

ఇటీవల అనేకమంది ప్రవాస తెలుగువారితో నేను జరిపిన చర్చలలో, ఇతర గల్ఫ్ దేశాలు కూడా భారతీయ కార్మికులను అక్కడనుంచి స్వదేశానికి పంపే ఏర్పాట్లలో ఉన్నట్లుగా వెల్లడించారు.  వీళ్లందరూ సరైన ఉపాధి పొందలేకపోతే,  మన దేశంలో మరో కొత్త సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచివుంది. కాబట్టి రాబోయే ఈ ఉపద్రవాన్ని కూడా సమర్ధంగా ఎదుర్కొని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమై ఉండాలి. 

ఈ నేపథ్యంలో కువైట్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చే వలస కార్మికుల భద్రత, జీవనోపాధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తిరిగివచ్చే వారందరికీ కావాల్సిన ఆహారం, ఆశ్రయం, వైద్య సాయం, జీవనోపాధి అందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకం చేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com