సౌదీ అరేబియా: మైనర్ల మరణశిక్షలపై కీలక నిర్ణయం

- April 27, 2020 , by Maagulf
సౌదీ అరేబియా: మైనర్ల మరణశిక్షలపై కీలక నిర్ణయం

రియాద్:సౌదీఅరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్ల నేరాలకు సంబంధించి మరణశిక్షలను రద్దు చేయాలని ఆ దేశ రాజు సల్మాన్‌ ఆదేశించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇటీవల సౌదీఅరేబియాలో కొరడా దెబ్బలను రద్దుచేసి, బదులుగా జైలుశిక్ష పొడిగించడం, జరిమానా విధించడం లేదా సమాజ సేవ శిక్షలను విధించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. మైనర్ల నేరాల మరణశిక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సహజంగా సౌదీఅరేబియాలో ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలుచేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజా ఆదేశాలు కాస్త ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. కాగా, ఈ శిక్షల సడలింపులో రాజు కుమారుడు, వారసుడైన యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
దేశాన్ని ఆధునీకరించి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని యువరాజు చూస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా సౌదీ అరేబియా ప్రతిష్ఠను మెరుగుపర్చాలని ప్రయత్నిస్తున్నారు. యువరాజు ఒకవైపు నేరాల ఆంక్షలు సడలిస్తూనే మరోవైపు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సౌదీ రాజు తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడ షియా మైనార్టీ వర్గంలోని కనీసం ఆరుగురికి మరణ శిక్ష నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వీళ్లంతా 18 ఏళ్లలోపు ఉండగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఇప్పటికే సౌదీ జైళ్లలో గరిష్ఠంగా పదేళ్లు శిక్ష అనుభవించిన వారి కేసులు ప్రాసిక్యూటర్లు సమీక్షించాలని, వీలైతే వారికి శిక్షలు తగ్గించాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే మైనర్ల ఉగ్రవాద సంబంధిత కేసులను ప్రత్యేకంగా విచారించనున్నట్లు అందులో వెల్లడించారని తెలుస్తోంది. అయితే, ఈ ఉగ్రవాద సంబంధిత కేసులు పదేళ్ల జైలు పరిమితికి లోబడి ఉంటాయో లేదో తెలియదు.ఆమ్నెస్టీ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థతో పాటు మానవ హక్కుల సంఘాలు కూడా సౌదీలో కనీసం మైనర్లకైనా మరణశిక్షలను రద్దు చేయాలని పోరాడుతున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com