WHOకు ట్రంప్ తాజా వార్నింగ్..!

- May 19, 2020 , by Maagulf
WHOకు ట్రంప్ తాజా వార్నింగ్..!

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య కూడా చిచ్చుపెట్టింది.. కరోనావైరస్ గురించి తెలిసినా ముందే హెచ్చరించలేదని ఆదినుంచి ఆరోపిస్తూ వస్తున్న ట్రంప్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరువల్లే.. అమెరికాలో భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా.. WHO ఫండ్స్ విషయాన్ని కూడా ప్రస్తవించారు.. ఇక, ఇప్పుడు ఇలాగైతే.. తాము డబ్ల్యూహెచ్‌వో సభ్యత్వంపై కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుందంటూ తాజాగా హెచ్చరించారు. ట్రంప్‌ వ్యాఖ్యలు గమనిస్తే.. గత ఏడాది డిసెంబర్‌లోనే కరోనావైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఉందని మరోసారి వ్యాఖ్యానించిన ఆయన.. వుహాన్‌ నగరం నుంచే ఈ ఆధారాలు అందినప్పటికీ ఆరోగ్య సంస్థ ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించని ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌కు లేఖరాసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. చైనా అధికారిక సమాచారానికి, క్షేత్ర స్థాయి నివేదికలకు వ్యత్యాసం ఉన్నప్పటికీ WHO ప్రేక్షకపాత్ర పోషించదని మండిపడ్డారు. 

గత ఏడాది డిసెంబరు 30నాటికే వుహాన్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఉందని లేఖలో పేర్కొన్న ట్రంప్.. ఇదే విషయాన్ని తైవాన్‌ ప్రభుత్వం సైతం నివేదించిందన్నారు. అయినా.. ప్రపంచదేశాలను అప్రమత్తం చేయాల్సిన ఆరోగ్య సంస్థ.. కొన్ని రాజకీయపరమైన కారణాలతో ఆ కీలక సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఆసక్తిచూపలేదని ఆరోపించారు. ఆ తర్వాత అంతర్జాతీయ వైద్య నిపుణుల్ని చైనాలోకి అనుమతించేలా.. డ్రాగన్ కంట్రీని ఒప్పించడంలోనూ డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని మండిపడ్డారు. టెడ్రోస్‌ అధనోమ్‌ వల్లే నేడు ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి పరిస్థితి వచ్చిందన్న అమెరికా అధ్యక్షుడు.. చైనాకు వత్తాసుపలకడం ఆపేసి.. ఇప్పటికైనా స్వతంత్రంగా వ్యవహరిస్తేనే సంస్థకు మంచిదన్నారు. అంతేకాదు.. సంస్థ తీరు రానున్న 30 రోజుల్లో మారకపోతే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వాతంగా ఆపేస్తానని హెచ్చరించారు ట్రంప్. మరోవైపు.. సంస్థలో తన సభ్యత్వంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇక, ట్రంప్ తాజా లేఖతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.. మరోవైపు.. ఎట్టకేలకు కరోనా పుట్టుక పై దర్యాప్తునకు చైనా అంగీకరించిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com