దేశంలో 100 ఆకర్షణీయ నగరాలను అభివృద్ధి : మోదీ
- January 31, 2016
దేశంలో 100 ఆకర్షణీయ నగరాలను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అభివృద్ధి చేయబోయే 20 నగరాల తొలి జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. తాజాగా వెలువడిన ఓ నివేదిక ప్రకారం ఆకర్షణీయ నగరాలకు నగిషీలు దిద్దాలంటే రాబోయే సంవత్సరాల్లో 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు అవసరమట. రాబోయే కొద్ది రోజుల్లో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ప్రైవేటు సెక్టార్ నుంచి 120 బిలియన్ డాలర్లు వస్తాయని డెలాయిట్ తన నివేదికలో పేర్కొంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా 'స్మార్ట్ సిటీ మిషన్' కోసం 7. 513 బిలియన్ డాలర్లను కేటాయించనుంది. ప్రాంతాలవారీగా చూస్తే కొన్ని నగరాల్లో పెట్టుబడులు పెట్టే విషయం సవాల్‌తో కూడినది. ఈ నేపథ్యంలో ప్రణాళిక, అమలు విధానం తదితర అంశాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ పీఎన్ సుదర్శన్ తెలిపారు. తొలివిడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 20 స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భువనేశ్వర్ తొలిస్థానంలో నిలవగా పుణె, జయపుర, సూరత్, కోచి, అహ్మదాబాద్, జబల్‌పూర్, విశాఖపట్నం, షోలాపూర్, దావణగెరె, ఇండోర్, న్యూదిల్లీ, కోయంబత్తూర్, కాకినాడ, బెలగావి, ఉదయ్‌పూర్, గువహటి, చెన్నై, లూథియానా, భోపాల్ ఉన్నాయి. 2016లో స్మార్ట్‌సిటీలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారని సర్వే పేర్కొంది. ఇందులో భాగంగా వైఫై నెట్‌వర్క్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తాయని వెల్లడించింది. అదేవిధంగా ఆయా నగరాల్లో సమస్యల పరిష్కారానికి కూడా సమాచార, ప్రసార సాంకేతికత చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 50 నగరాల్లో రిలయన్స్ జియో వైఫై సేవలను ప్రారంభిస్తుండగా, ఈ విషయంలో భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్‌లు సంయుక్తంగా ముందుకు వెళ్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి ఫేస్‌బుక్ గ్రామీణ భారతంలో 100 చోట్ల ఈ ఏర్పాట్లు చేయనుంది. గూగుల్ 400 రైల్వేస్టేషన్లలో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







