ఆయిల్ బావిలో భారీ అగ్నిప్రమాదం

- June 09, 2020 , by Maagulf
ఆయిల్ బావిలో భారీ అగ్నిప్రమాదం

అసోం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలో న్యాచురల్ గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL)బావిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బావిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. గడిచిన 14రోజులుగా ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతున్న విషయం తెలిసిందే. మే-27న గ్యాస్ లీక్ అవడం ప్రారంభం అయింది.

అయితే ఇవాళ(జూన్-9,2020)మధ్యాహ్నాం నుంచి రాజధాని గౌహతికి 500కిలోమీటర్ల దూరంలోని బాఘ్‌జాన్ వద్దనున్న ఈ చమురు బావి నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఫైర్ మొదలైన వెంటనే అసోం సీఎం సర్బానంద సోనోవాల్..కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తో ఫోన్ లో మాట్లాడారు.
ఈ ఏరియాలో గ్యాస్ లీక్ అవుతున్నప్పటినుంచి NDRF(National Disaster Response Force)సిబ్బంది రంగంలోకి దిగి రెడీగా ఉన్నారు. అసోంలోని ఉన్నతాధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సోమవారం సింగపూర్ నుంచి "వెల్ కిల్లింగ్"నిపుణులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆపరేషన్స్ లో వాళ్లు పాల్గొన్నారు. చమురు బావి నుంచి గ్యాస్ లీకేజీని అరికట్టడానికి సింగపూర్‌కు చెందిన ముగ్గురు నిపుణులు ప్రయత్నించిన మరుసటి రోజే ఈ మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడిన సమయంలో వారు చమురు బావి దగ్గర లేకపోవడం ఊరటనిచ్చే అంశం. ఆ సమయంలో వారు ఆయిల్ ఇండియా ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నారు.

కాగా,ప్రస్తుతం బావి నుంచి పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నమంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామనని ఆయిల్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఓఎన్జీసీకి చెందిన ఓ ఫైర్‌మ్యాన్‌కి స్వల్ప గాయాలు కావడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని ఆయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జయంత్ బొర్ముడోయ్ తెలిపారు. ఈ మంటలవల్ల స్థానికులకు వెంటనే ఎలాంటి ఇబ్బంది ఉండదని,గ్యాస్ లీకేజీని అదుపు చేయడానికి దాదాపు 300 మంది పని చేస్తున్నారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com