అనుబంధాల్ని చంపేస్తున్న కరోనా..కూతురి కోసం ఆస్పత్రికి రానన్న తల్లి

- June 16, 2020 , by Maagulf
అనుబంధాల్ని చంపేస్తున్న కరోనా..కూతురి కోసం ఆస్పత్రికి రానన్న తల్లి

రూపాయి రూపాయీ నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య తగాదా పెడతా..ఆత్మీయులు..బంధువుల మధ్య తగవులు పెడతా అన్నదంట. ఈకరోనా కాలంలో 'కరోనా వైరస్.. కరోనా వైరస్ నువ్వేం చేశావంటే.. మీ ఆర్థక వ్యవస్థల్నే కాదు మానవ సంబంధాలపై దెబ్బ కొడతాను..కన్న బిడ్డల దగ్గరకు కన్నతల్లు కూడా రాకుండా చేస్తాను అన్నట్లుగా ఉంది నేటిపరిస్థితి చూస్తే. సరిగ్గా అటువంటిదే జరిగింది యూపీలో. కన్నప్రేమకు కరోనా మహమ్మారి పరీక్ష పెట్టింది. అగ్ని పరీక్షకు ఏమాత్రం తీసిపోని ఈ పరీక్షలో కరోనా కన్నప్రేమను ఇట్టే ఓడించేసింది.

వివరాల్లోకి వెళితే..గోరఖ్‌పూర్ సూరజ్‌కుండ్ ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలికకు కరోనా సోకింది. ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సి వచ్చింది. అలా పాపకు తోడుకు తల్లి వెళ్లాలి. అది రూల్ కాదు..కన్నప్రేమ. కానీ ఇక్కడ ఆ కన్నప్రేమ కరోనా భయంతో కర్కశంగా మారింది. పాపకు తోడుగా ఉండటానికి ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి రానని తెగేసి చెప్పేసింది. ఏ తల్లైనా తన బిడ్డ ప్రాణాన్ని అడ్డువేసి బిడ్డ కోసం పాటు పడుతుంది. తనకేమైనా పరవాలేదు బిడ్బని విడిచిపెట్టేది లేదని అంటుంది. కానీ..కరోనా పుణ్యమా అని ఆ తల్లి ఆసుపత్రికి రానని ఖరాఖండిగా చెప్పేసింది.

ఆసుపత్రికి వెళ్తే కరోనా సోకుతుందన్న భయం ఆమెలోని కన్నప్రేమను చంపేసింది. కన్నబిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఆమె నిరాకరించింది. అయితే తల్లిదండ్రులు లేనిదే చిన్నపిల్లలనుగానీ..మైనర్లను గానీ ఆసుపత్రుల్లో చేర్చుకునే అవకాశం లేదు. దీంతో..అక్కడి డాక్టర్లు స్వయంగా సదరు అమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు ఎంతగానో నచ్చజెప్పారు. అలా చెప్పగా చెప్పగా..ఆమె ఎట్టకేలకూ అంగీకరించటంతో డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లి బాలికకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

కరోనాతో మనుషులు ఎన్నో నేర్చుకుంటున్నారు.. అంతకుమించి ఎంతో కోల్పోతున్నారు. సాటి మనిషి కళ్లెదుటే కుప్పకూలిపోతున్నా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి కరోనా ఉందేమోననే భయం. ఆత్మీయులు..బంధువులు..ఆఖరికి కట్టుకున్నవారు..కన్నవారు చనిపోయిన అంత్యక్రియలకు కూడా రావటంలేదు. కారణం కరోనా భయం. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా భయంతో మానవ సంబంధాలు తెగిపోతున్నాయా? మనుషుల్లో మానవత్వం అనే మాటే చచ్చిపోతోందా? అనే ఆందోళన కలుగుతోంది కొన్ని ఘటనల గురించి తెలుస్తుంటే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com