బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి. నరసింహ రావు శత జయంతి

- June 28, 2020 , by Maagulf
బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి. నరసింహ రావు శత జయంతి

స్వాతంత్ర్య సమరయోధులు, బహుభాషా కోవిదులు, పరిపాలనాదక్షులు, రాజకీయవేత్త, విద్యావేత్త ఒక్కమాటలో చెప్పాలంటే సర్వం తెలిసిన ప్రతిభా మూర్తి పి.వి నరసింహ రావు 1921 జూన్ 28 న వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. కొన్ని తరాల క్రిందట మెదక్ జిల్లా పాములపర్తి గ్రామం నుండి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి వలస వెళ్లారు. వీరి అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహ రావు. వీరి విద్యాభ్యాసం హనుమకొండ, వరంగల్లు,హైదరాబాద్ లలో జరిగింది. సాహిత్యం,సంగీతం,చిత్రలేఖనం,లలితకళ ల్లో అమితాసక్తి కనబరచేవారు. 1937లో మెట్రిక్లేషన్ పూర్తవగానే వరంగల్ లో ఇంటర్ లో చేరారు. అప్పుడే విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వందేమాతరం ఆలపించి, కళాశాల నుండి బహిష్కృతులయ్యారు. తరువాత నాగపూర్ వెళ్లారు. 1939 లో వందేమాతరం ఉద్యమకారులకు కలిసి త్రిపుర లో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ శ్రేణిలో పాసై పునా లో బి ఎస్సీ తర్వాత నాగపూర్  విశ్వవిద్యాలయంలో ఎల్. ఎల్. బి. చేరి ప్రథములుగా నిలిచి స్వర్ణ పతకం సాధించారు. అప్పుడే వీరికి జాతీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైనారు. వీరు హైదరాబాద్ వచ్చి బూర్గుల రామకృష్ణా రావు వద్ద జూనియర్ గా చేరారు. నిజాం సంస్థానం సరిహద్దుల్లో స్వాతంత్ర్య సమర శిబిరాలు ఏర్పటాయినాయి. రహస్యంగా ఆయుధ సేకరణ జరిపే కార్యక్రమాన్ని ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని పి.వి కి అప్పజెప్పారు. పోలీస్ చర్య తర్వాత 1948 లో కాకతీయ వార పత్రిక ప్రచురణను ప్రారంభించారు. అనేక రచనలు చేశారు. 1951 నుండి రాజకీయాల్లో కొనసాగారు. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి రామానంద తీర్థ కు పి వి అత్యంత ప్రియమైన శిష్యులు. 1957-77 కాలంలో పి వి శాసన సభ్యులు గా ఉన్నారు. 1962-64 న్యాయ, సమాచార మంత్రిగా, 1964-67 న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా, 1967 లో వైద్య శాఖా మంత్రిగా, 1968-71 లో విద్యాశాఖ మంత్రిగా, 1971- 73 ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఆయన కార్య శీలత జాతీయ స్థాయికి విస్తరించింది. 1977 లో హనుమకొండ నుండి లోక్ సభకు ఎన్నికైనారు. 1978 లో పబ్లిక్ లో కమిటీ చైర్మన్ హా ఎన్నికైనారు. 1980 నుండి 1984 వరకు ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా ,తర్వాత రాజీవ్ గాంధీ మంత్రి వర్గంలో క్యాబినెట్ రక్షణ, తర్వాత మానవ వనరులు శాఖలను నిర్వహించి నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. 1988-89 లో విదేశాంగ మంత్రి గా పనిచేశారు. 1989 లో నాల్గవసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం పి.వి భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన మొదటి దక్షిణ భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 1991 లో నంద్యాల నుండి, 1997 లో బరంపురం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఏ పదవిలో ఉన్నా, ఏ వ్యవహార సరళి లో ఉన్నా, ఏది మాట్లాడిన పి.వి ముద్ర స్పష్టంగా గోచరించే వ్యక్తిత్వం ఆయనది. ఎన్నో సంస్కరణలు,మరెన్నో నిర్ణయాలు, అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. విశ్వనాథ సత్యనారాయణ వారి వేయి పడగలు నవలను 'సహస్ర ఫణ్' అనే పేరుతో హిందీ లోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అవార్డును అందుకున్నారు. 'ఇన్ సైడర్' అనే పేరుతో ఆంగ్లంలో అత్మకథాత్మకమైన నవలను రచించారు. తెలుగు వెలుగు వాని  కీర్తిని నలుదిక్కులా చాటిన మహోన్నత వ్యక్తి  పి.వి. వీరు డిసెంబర్ 23, 2004 న మరణించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com