దోహా:స్కాలర్ షిప్ పేరుతో సైబర్ నేరాలు..అప్రమత్తంగా ఉండాలని ఖతార్ హెచ్చరిక

- July 03, 2020 , by Maagulf
దోహా:స్కాలర్ షిప్ పేరుతో సైబర్ నేరాలు..అప్రమత్తంగా ఉండాలని ఖతార్ హెచ్చరిక

దోహా:మీకో ఫోన్ వస్తుంది. తాము విదేశాల్లోని ఖతార్ రాయబార కార్యాలయంలో ఉద్యోగులం అంటూ అవతలి వ్యక్తి మీతో పరిచయం చేసుకుంటాడు. మీపై అమెరికా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉన్నాయని, మీ ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయని నమ్మిస్తాడు. మీ బ్యాంక్ లావాదేవీలు అనుమానస్పదంగా ఉన్నాయని, ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని, మీరు పెద్ద సమస్యలో ఉన్నారని భయపెట్టేస్తాడు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తమక బ్యాంకు ఖాతాకు కొన్ని డబ్బులు పంపించాలని చెబుతాడు. ఫోన్ చేసిన వ్యక్తి మాటలు విని కంగారుపడితే ఇక మీ బ్యాంకులోని సొమ్ము కొల్లగొట్టేస్తాడు. ఈ మధ్య ఖతార్ పౌరులు, ప్రవాసీయులను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిని, విదేశాల్లో చదువుకుంటున్న ఖతార్ ప్రజలను గుర్తించి వారిని కాంటాక్ట్ అవుతుంది ఈ సైబర్ ముఠా. వారికి ఖతార్ ప్రభుత్వం స్కాలర్ షిప్ వెసులుబాటు కల్పించిందని, ముందుగా కొంత డబ్బు తమ అకౌంట్ కు పంపాలని నమ్మించి మోసాలకు పాల్పడుతోంది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ పౌరులను హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మి వారి బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ చేయవద్దని కోరింది. అలాగే ఖతార్ ప్రభుత్వం స్కాలర్ షిప్ లకు సంబంధించి స్పష్టమైన విధానాలు అవలంభిస్తోందని, ఎవరు పడితే వాళ్లు ఫోన్ చేసి స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు చెబితే నమ్మవద్దని సూచించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మా గల్ఫ్ ప్రథినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com