షార్జా:టిక్కెట్లకై బారులు తీరిన జనం..ఎదురైన చేదు అనుభవం

- July 04, 2020 , by Maagulf
షార్జా:టిక్కెట్లకై బారులు తీరిన జనం..ఎదురైన చేదు అనుభవం

షార్జా: గల్ఫ్ లో అమాయక కార్మికుల కష్టాలు మరోసారి అధికారులకు సవాలుగా మారింది...

కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. దేశాలమధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎందరో ఉపాధి కోల్పోయి పూట గడవక అల్లాడుతున్న కార్మికులు కోకొల్లలు. విదేశాల్లో చిక్కుకున్న ఉపాధి కోల్పోయిన వారిని, గర్భిణీ స్త్రీలను, వైద్య సహాయం కోరే వారిని స్వదేశం అయిన ఇండియా తరలించేందుకు భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ 'వందే భారత్ మిషన్'. ఇప్పటికి మూడు విడతల్లో ప్రవాసీయులను స్వదేశానికి చేర్చిన విషయం విదితమే.

అయితే, ఈ మిషన్ ద్వారా సగటు మధ్యతరగతి మనిషికి న్యాయం జరిగిందా అంటే ప్రస్నార్ధకమే! ఈ మిషన్ అత్యధికంగా కేరళకు విమానాలు నడుపుతున్నాయని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ లో చిక్కుకున్న అసంఖ్యాక కార్మికులకు ఈ మిషన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇండియా నడుపుతున్న మిషన్ ద్వారా విమానాలకై ఎదురుచూస్తూ ఉండిపోవటం తప్పించి కార్మికులకు ఒరిగిందేమి లేదని ఘాటుగా వినిపిస్తున్న సత్యం.

ఇదిలా ఉండగా, యూఏఈ లో వందే భారత్ మిషన్ ద్వారా ఇండియా వెళ్లేందుకు నమోదు చేసుకున్న వారికి  భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన చేసింది.నమోదు చేసుకున్నవారు తమ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా లేదా ఎయిర్ఇండియా ఆఫీసుల్లో పొందవచ్చనీ, కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయానికి రానవసరం లేదనీ ప్రకటన సారాంశం. క్రెడిట్ కార్డు లేక ఆన్లైన్ లో టిక్కెట్లు కొనుక్కోలేని కార్మికులు ఎయిర్ఇండియా ఆఫీసు దగ్గర ఎండ సైతం లెక్కచేయక ఎలాగోలా టిక్కెట్ కొనుక్కొని స్వదేశానికి వెళ్లాలని గంపెడాశతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీగా లైన్ లో బారులుతీరారు. భారీగా చేరిన జనాన్ని చూసి పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో టిక్కెట్ కోసం వచ్చిన వారు తమ ఆశ నీరుగారిపోయిందని వెనుదిరిగారు.

సంఘటనపై దుబాయ్ లోని తెలుగు సోషల్ వర్కర్ రవి కొమర్రాజు స్పందిస్తూ "ఉపాధి కోల్పోయి ఉండటానికి చోటు కూడా లేక రోడ్లపై నివసిస్తున్న వారు ఎందరో మా దృష్టికి వచ్చారు..మేము చేతనైనంత సహాయం చేసి ఎందరికో  నిత్యావసర సరుకులు మరియు టిక్కెట్లు ఏర్పాటు చేసి ఇండియా పంపించటం జరిగింది. కార్మికులు ఆన్లైన్ టిక్కెట్లు కొనుక్కునేందుకు అవసరమైన క్రెడిట్ కార్డులు లేని వారు. పైగా ఆన్లైన్ లో టిక్కెట్లు చాల కొద్దీ వ్యవధిలోనే కొనుగోలు అయిపోతున్నాయి. అలాంటప్పుడు వారు వేరే దారిలేక ఇలా ఎయిర్ఇండియా ఆఫీసువద్ద గుమిగూడటం జరిగింది. ఎంతసేపు వేచి చూసినా వారికి టిక్కెట్లు అందకపోవటం బాధాకరం. రాయబార/కాన్సులేట్ కారాలయాలు ఈ సంగతిపై సమీక్ష జరిపి తగు విధంగా ఈ టిక్కెట్లను ఏర్పాటు చేయాలి" అని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com