రేపటి నుంచి పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న దుబాయ్

- July 06, 2020 , by Maagulf
రేపటి నుంచి పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న దుబాయ్

దుబాయ్:కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ అనంతరం సుమారు మూడు నెలల తర్వాత పర్యాటకులకు దుబాయ్ స్వాగతం పలుకుతోంది. రేపటి నుంచి పర్యాటకులను  దుబాయ్ లోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది.అందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసింది. కరోనా నేపథ్యంలో పర్యాటకులు సమర్పించాల్సిన పత్రాలను ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. క్వారెంటైన్ బాధలు లేకుండా  దుబాయ్ అంతటా తిరగడానికి అవసరమైన పత్రాల కోసం ఒక్కసారి ఈ వార్తలోకి లుక్కేయండి. దుబాయ్ కి వెళ్లే పర్యాటకులకు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్‌ తప్పనిసరి. ప్రయాణానికి 96 గంటల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్‌లో టూరిస్ట్.. కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ప్రయాణికుడు ఒకవేళ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించకపోతే..దుబాయ్ లోని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో సదరు ప్రయాణికుడు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరీక్షా ఫలితాలు వచ్చే వరకు సదరు ప్రయాణికుడు క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రయాణానికి ముందే టూరిస్ట్.. కరోనాకు వర్తించే ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. సదరు ప్రయాణికుడికి ట్రావెల్ ఇన్సూరెన్స్ లేనట్లయితే.. ఒకవేళ తమకు కరోనా లక్షణాలు బయటపడితే.. దాని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామంటూ పర్యాటక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టూరిస్ట్ జాతీయతను బట్టి.. దుబాయ్, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సౌకర్యం లేని దేశస్తులు ప్రయాణానికి ముందు దుబాయ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో విజిట్ వీసా పొందాలి. అంతేకాకుండా ప్రయాణానికి ముందే టూరిస్టులు COVID-19 DXB యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకునకు కరోనా లక్షణాలు ఉన్నట్లు దుబాయ్  అధికారలు భావిస్తే.. సదరు పర్యాటకునకు విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com