దుబాయ్ ఎక్స్ పో 2020లో మరో ఘనత..అనుకున్న సమయానికే మెట్రో లైన్ ప్రారంభం

దుబాయ్ ఎక్స్ పో 2020లో మరో ఘనత..అనుకున్న సమయానికే మెట్రో లైన్ ప్రారంభం

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దుబాయ్ ఎక్స్ పో 2020లో మరో ఘనత చోటుచేసుకుంది. భారీ స్వాగత ద్వారాలు, అబ్బురపరిచే ఏర్పాట్లతో ప్రపంచాన్ని ఆకర్షించేలా దుబాయ్ ఎక్స్ పో 2020 ప్రారంభానికి రెడీగా ఉంది. అయితే..కరోనా ప్రభావంతో ఏడాది ఆలస్యంగా వచ్చే సంవత్సరం అక్టోబర్ లో ప్రారంభం కానుంది. అయితే..ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ ఎక్స్ పో 2020లో చేపట్టిన కొత్త మెట్రో లైన్ పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేసి ప్రారంభించారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టును Dh11 బిలియన్ల ఖర్చుతో పూర్తి చేశారు. రెడ్ లైన్ పొడగింపులో భాగంగా మొత్తం 15 కిలోమీటర్లను పొడవు, ఏడు కొత్త మెట్రో స్టేషన్లను నిర్మించారు. ఇందులో రెండు అండర్ గ్రౌండ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఆరు నెలల పాటు కొనసాగే దుబాయ్ ఎక్స్ పో 2020కి ప్రజలు, అతిథులను తరలించటంలో కొత్త మెట్రో లైన్ ఉపయోగపడనుంది. 

దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కొత్త మెట్రో లైన్ 'ఎక్స్ పో 2020 మెట్రో లైన్' ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్టర్ వేదిక వీడియో పోస్ట్ చేశారు. "Dh11 బిలియన్లతో మెట్రో లైన్ పొడిగింపు పనులు చేపట్టం. 47 నెలల క్రితం ప్రాజెక్ట్ ను ప్రకటించాం. నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ఈ రోజు ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభం చేశాం. అది దుబాయ్ అంటే. మేం ఏం చెప్తామో అదే చేస్తాం..ఏది చేస్తామో అదే చెబుతాం. ఈ ప్రాజెక్టు కోసం 1200 మందికిపైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు 80 మిలియన్ల పని గంటల నిర్విరామంగా కష్టపడ్డారు" అని వీడియోలో వెల్లడించారు. ఎక్స్ పో 2020 మెట్రో లైన్ పేరుతో ప్రారంభమైన కొత్త మార్గంలో సెప్టెంబర్ నుంచి ప్రజలను అనుమతిస్తారు. ప్రతి రోజు 50 మెట్రో ట్రైన్లు నడుస్తాయి. ఇందులో 15 ట్రైన్లు ప్రత్యేకంగా ఎక్స్ పోకి వెళ్లే ప్రయాణికుల కోసం కేటాయించారు. 

Back to Top