గల్ఫ్ కార్మికుడికి కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం

- July 24, 2020 , by Maagulf
గల్ఫ్  కార్మికుడికి  కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం

తెలంగాణ:ఉపాధి కోసం గల్ఫ్ దేశం సౌదీ అరేబియాకు వలస వెళ్ళి, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిజామాబాద్ వ్యక్తి కి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు.కవిత సహకారంతో బూక్యా దశరథ్ మరొక సహాయకుడు తన వెంట రాగా సౌదీ అరేబియా నుండి స్వస్థలానికి చేరుకున్నాడు.

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం బాలానగర్ కు చెందిన బూక్యా ధశరథ్ (లంబాడి శంకర్) ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అయితే అక్కడ పక్షవాతం భారిన పడడంతో చికిత్స నిమిత్తం సౌదీ లోనే ఆసుపత్రి లో చేరాడు. ఇదే సమయంలో దశరథ్  ఇకామా( రెసిడెన్సీ వీసా) గడువు తేదీ ముగియడంతో స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు వీసా గడువు ముగియడంతో దశరథ్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇదే సమయంలో అతని సోదరుడు లంబాడి విఠల్, సౌదీ లో దశరథ్ తో ఉండి అన్ని సేవలు చేసాడు. 

దశరథ్ పరిస్థితి గురించి స్థానిక సర్పంచ్ నిహారిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి  విషయం తేగా ఎమ్మెల్యే గోవర్ధన్ కవితకు విషయం తెలిపి మంచానికే పరిమితమైన దశరథ్ ను ఇంటికి తీసుకురావాలని కోరాడు. కవిత సూచనతో సౌదీ జాగృతి అధ్యక్షులు మౌజం అలీ ఇఫ్తెకార్ అక్కడ దశరథ్, విఠల్ ఇరువురితో మాట్లాడి ధైర్యం చెప్పి సహాయం అందించారు. అలాగే   దశరథ్, అతని సహాయకుడు విఠల్ ఇరువురు హైదరాబాద్ వచ్చేందుకు రూ.లు 55,000 తో టిక్కెట్లు ఏర్పాటు చేశారు‌ మాజీ ఎంపీ కవిత. గురువారం రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న దశరథ్ తో కల్వకుంట్ల కవిత ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెప్పారు. కల్వకుంట్ల కవిత సూచనతో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారులతో మాట్లాడి ఇరువురిని హోం క్వారెంటైన్ కు అనుమతి ఇప్పించడంతో పాటు స్వస్థలానికి వెళ్ళేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసారు. నేడు ఇంటికి చేరుకున్న లంబాడి దశరథ్ ను తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు  పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత సూచన మేరకు దశరథ్ వైద్యానికి కూడా సహాయం అదిస్తామని దశరథ్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు తమను ఆదుకుని అండగా నిలిచిన కవిత కి, విషయం కవిత దృష్టికి  తీసుకువెళ్లిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి దశరథ్, విఠల్ ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటికి ప్రాణాలతో చేరుతానో లేదో అనుకున్న తనను క్షేమంగా ఇంటికి చేర్చిన కవితకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కన్నీటి పర్యంతమయ్యారు బాదితులు. నేడు బాదిత కుటుబాన్ని పరామర్షించిన వారిలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి సౌదీ అరేబియా అధ్యక్షులు ఇఫ్తెకార్, జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్, జెడ్పీటీసీ తనూజా శ్రీనివాస రెడ్డి, వైస్ ఎంపీపీ కుంచాల రాజు, బాలానగర్ సర్పంచ్ నిహారిక ఈశ్వర్ వొల్లెపు, సాయి, భాస్కర్, సంతోష్, టీఆర్ఎస్, జాగృతి నాయకులు పాల్ఘొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com