యూ.ఏ.ఈ:వీసా ఫైన్ మాఫీ పొందాలంటే ఎలా?

- July 24, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:వీసా ఫైన్ మాఫీ పొందాలంటే ఎలా?

యూ.ఏ.ఈ:మార్చి 1 నాటికి గడువు ముగిసిన వీసాదారులకు యూఏఈ ప్రభుత్వం ఫైన్ మాఫీ పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 17 నాటికి దేశం విడిచి వెళ్లే వాళ్లంతా ఫైన్ మాఫీ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఇప్పటికే యూఏఈ స్పష్టం చేసింది. అయితే..ఫైన్ మాఫీ స్కీం ప్రయోజనాలు, భారత్ కు తిరుగు ప్రయాణంపై ప్రవాసీయుల నుంచి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మాఫీ పథకానికి ఎవరు అర్హులు? ఫైన్ మాఫీ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎన్ని రోజుల గడువు పడుతుంది? వీసా రెన్యూవల్ విషయంలో స్పాన్సర్ స్పందించకుంటే ఏం చేయాలి?ఒకవేళ ఫైన్ మాఫీ పొంది భారత్ వెళ్తే తిరిగి యూఏఈ వచ్చేందుకు అవకాశం ఉంటుందా?ఇలాంటి ప్రశ్నలకు వ్యక్తం చేస్తూ యూఏఈలోని భారత రాయబార, దౌత్యకార్యాలయాన్ని ప్రవాసీయులు సంప్రదిస్తున్నారు.ప్రవాసీయుల సందేహాలకు తమ అవగాహన మేర సమాధానాలు ఇచ్చిన అధికారులు..ఖచ్చితమైన సమాధానాలు మాత్రం యూఏఈ అధికార యంత్రాంగం నుంచి పొందాలని సూచించింది.ప్రవాసీయులు అడిగిన పలు సందేహాలకు భారత రాయబార/దౌత్య కార్యాలయం ఇచ్చిన సమాధానాలు  ఎక్స్క్లూజీవ్ గా 'మా గల్ఫ్' మీ కోసం అందిస్తోంది.. 

1. నా రెసిడెంట్/ఎంప్లాయ్ మెంట్ వీసా గడువు మార్చి1, 2020కి ముందు ముగిసింది. మా కంపెనీ/స్పాన్సర్ వీసా రెన్యూవల్ చేయించటం లేదు/సహకరించటం లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? 
జవాబు : మీరు మీ పాస్ పోర్ట్ కాపీ, వీసా కాపీలను [email protected] (అబుధాబి పరిధిలోనివారు)  [email protected]  (దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ పరిధిలోని వారు) కి మెయిల్ చేయండి. మీరు పంపించిన వివరాలను రాయబార/దౌత్య కార్యాలయాలు సంబంధిత యూఏఈ అధికారులు పంపించి ఫైన్ మాఫీ వర్తించేలా ప్రాసెస్ చేస్తాం. ఫైన్ మాఫీ వర్తింపునకు యూఏఈ అధికారులను సమ్మతం రాగానే మీకు ఆ సమాచారాన్ని చేరవేస్తారు. ఆ తర్వాత మీరు
ఇండియాకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే..ఖచ్చితంగా ఆగస్ట్ 17, 2020 లోగా మీరు ఖచ్చితంగా యూఏఈ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. *(స్పాన్సర్లు స్పందించకున్నా..మరి ఏ ఇతర కారణం చేతనైనా మీ వీసా రెన్యూవల్ కానట్లైతే ఆగస్ట్ 17 నాటికి యూఏఈ విడిచి వెళ్లాల్సిందే. లేదంటే వీసా గడువు ముగిసిన నాటి నుంచి నెల రోజుల గ్రేస్ పీరియడ్ మినహాయించుకొని ఆ తర్వాతి రోజులకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. )

2. నా పర్యాటక వీసా/ఎంట్రీ పర్మిట్ వీసా గడువు మార్చి 1,2020కి ముందే ముగిసింది. నేను ఏం చేయాలి? 
జవాబు: ఫైన్ మాఫీ స్కీం పర్యాటక వీసాతో పాటు ఎంట్రీ పర్మిట్ వీసాలకు కూడా వర్తిస్తుంది. మీరు అబుధాబి పరిధిలో వీసా పొందినట్లైతే [email protected]కి మీ పాస్ పోర్ట్, వీసా కాపీలను పంపించండి. మీరు దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ పరిధిలో వీసా పొందినట్లైతే
[email protected] కి పాస్ పోర్ట్, వీసా కాపీలను పంపించండి.  మీరు పంపించిన వివరాలను రాయబార/దౌత్య కార్యాలయాలు సంబంధిత యూఏఈ అధికారులు పంపించి ఫైన్ మాఫీ వర్తించేలా ప్రాసెస్ చేస్తాం. ఫైన్ మాఫీ వర్తింపునకు యూఏఈ అధికారులను సమ్మతం రాగానే మీకు ఆ సమాచారాన్ని చేరవేస్తారు. ఆ తర్వాత మీరు ఇండియాకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే..ఖచ్చితంగా ఆగస్ట్ 17, 2020 లోగా మీరు ఖచ్చితంగా యూఏఈ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 

3. నాకు పాస్ పోర్టు లేదు, నేను ఎమర్జెన్సీ సర్టిఫికెట్(EC)కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాను. నేను మార్చి 1,2020కి ముందుగానే యూఏఈకి వచ్చాను. నా వీసా గడువు కూడా మార్చి 1 నాటికి ముగిసింది. ఈసీ తీసుకునే ప్రాసెస్ ఎంటో తెలుపగలరు?

జవాబు: మీ దగ్గర పాస్ పోర్టు లేకుంటే వీలైనంత తొందరగా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోండి. భారత రాయబార/దౌత్య కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాస్ పోర్టు పోయినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీని కూడా ప్రయాణ సమయంలో మీ వెంట తీసుకెళ్లండి. ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించాల్సి ఉంటుంది. 

4. నా రెసిడెంట్/విజిట్ వీసా మార్చి 1 నాటికి ముగిసింది. మరో రెండు మూడ్రోజుల్లో ఇండియా వెళ్లేందుకు ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్నాను. వీసా ఫైన్ మాఫీ స్కీం ద్వారా ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉందా?
జవాబు : వీసా ఫైన్ మాఫీ స్కీం ద్వారా ప్రయోజనం పొందేందుకు మీరు మీ పాస్ పోర్ట్, వీసా వివరాలను ముందుగా భారత్ రాయబార/దౌత్య కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. మేం వాటిని సంబంధిత యూఏఈ అధికారులకు పంపిస్తాం. వారు అన్ని పరిశీలించి ఫైన్ మాఫీ చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. ఈ ప్రాసెస్ పూర్తి కావటానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుంది. మీరు రెండు మూడ్రోజుల్లో ప్రయాణం పెట్టుకుంటే ఫైన్ మాఫీ స్కీం వర్తించకపోవచ్చు.
ఇండియా ప్రయాణానికి కనీసం ఏడు రోజుల పని దినాలకు ముందు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫైన్ మాఫీ స్కీం ద్వారా ప్రయోజనం పొందాలంటే మీ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాదనుకుంటే ఫైన్ చేల్లించాల్సి ఉంటుంది.

5. మార్చి 1 నాటికిగానీ, ఆ తర్వాతగానీ వీసా గడువు ముగిసి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పై భారత్ వెళ్లినట్లైతే..తిరిగి యూఏఈ వచ్చేందుకు అవకాశం ఉంటుందా? అలా యూఏఈ విడిచి వెళ్లిన వారిపై యూఏఈ తిరిగి రాకుండా నిషేధం విధిస్తారా?
జవాబు : మాకు(రాయబార/దౌత్యకార్యాలయం) ఉన్న అవగాహన మేరకు వీసా ఫైన్ మాఫీ పొందిన వారు యూఏఈ తిరిగి వచ్చేందుకు ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఎలాంటి నిషేధం విధించే అవకాశం లేదు. అలాగే రెసిడెన్సీ వీసా నిబంధనలు ఉల్లంఘనల విషయంలో జరిమానా చెల్లించిన వారు కూడా తిరిగి వచ్చేందుకు అవాంతరాలు ఉండవు. 

6. నేను విజిట్ వీసాపై యూఏఈ వచ్చాను. నా వీసా గడువు మార్చి1, 2020 నాటికి ముగిసింది. నేను ఫైన్ చెల్లించకుండా దేశం విడిచి వెళ్లవచ్చా?
జవాబు : మాకు(రాయబార/దౌత్యకార్యాలయం) ఉన్న సమాచారం మేరకు ఆగస్టు 10,2020 కంటే ముందే దేశం విడిచి వెళ్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

7. రెసిడెంట్ / ఎంప్లాయ్ మెంట్ వీసా/ డిపెండెంట్ వీసా మార్చి 1 నాటికి ముగిసి..కంపెనీ యాజమాన్యం వీసా రెన్యూవల్ చేయించని పరిస్థితుల్లో ఏం చేయాలి? వీసా రెన్యూవల్ కు స్పాన్సర్ స్పందించకుంటే ఎలా?
జవాబు : యూఏఈ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జులై 11 నాటికి ఎలాంటి వీసా రెన్యూవల్ పై మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత గడువు ముగిసిన రెసిడెన్సీ వీసాదారులు అంతా ఆక్టోబర్ 10 లోగా వీసా రెన్యూవల్/రెగ్యులరైజ్ చేయించాలి. దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవటం ఉత్తమం. ఒక వేళ మీరు వీసా రెన్యూవల్ చేయించని పక్షంలో దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే జులై 11 నుంచి మీరు ప్రయాణం చేసే నాటికి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు జరిమానా చెల్లించాల్సిందే. ఒకవేళ ఆగస్ట్ 11 నాటికి మీరు యూఏఈ విడిచి వెళ్తే యూఏఈ నూతన మార్గదర్శకాల మేరకు నెల రోజుల గ్రేస్ పీరియడ్ పరిధిలోకి వస్తారు. ఆ సమయానికి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణకు : మీ రెసెడెన్సీ/ఎంప్లాయ్ మెంట్ వీసా గడువు 25 మే నాటికి ముగిసిందనుకుందాం. వీసా రెన్యూవల్ చేయించకుండా మీరు ఆగస్ట్ 1న యూఏఈ విడిచి వెళ్తున్నారు. అంటే వీసా గడువు ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలలకు మీరు దేశం విడిచి వెళ్తున్నట్లు లెక్క. ఇలాంటి సందర్భాల్లో యూఏఈ ప్రకటించిన 30 రోజుల గ్రేస్ పీరియడ్ ప్రకారం జూన్ 24 వరకు మీరు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, జూన్ 25 నుంచి ఆగస్ట్ 1 వరకు దేశంలోనే ఉన్నందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఆగస్ట్ 17లోగా దేశం విడిచి వెళ్తే మీరు ఫైన్ మాఫీ పథకం వర్తిస్తుంది కనుక ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఇండియా వెళ్లవచ్చు.

8. వీసా ఫైన్ మాఫీ పొందిన నాకు దేశం విడిచా వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన సందర్భాల్లో విమాన టికెట్లు అందుబాటులో లేకుంటే ఏం చేయాలి?
జవాబు : విమాన టికెట్ల కన్ఫర్మేషన్ పై దిగులు చెందాల్సిన అవసరం లేదు. వందే భారత్ మిషన్ లో భాగంగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే చార్టెర్డ్ ఫ్లైట్స్ కూడా నడుస్తున్నాయి. ఒక వేళ ఎవరైనా ప్రయాణికుడు విమాన టికెట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే  [email protected] లేదా [email protected] సమాచారం అందిస్తే ఆగస్ట్ 17 నాటికి టికెట్లు ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తాం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com