కరోనాపై సమగ్ర సమాచారం అవసరం, మానవత్వం చూపించాల్సిన సమయమిది--శేఖర్ కమ్ముల

- July 24, 2020 , by Maagulf
కరోనాపై సమగ్ర సమాచారం అవసరం, మానవత్వం చూపించాల్సిన సమయమిది--శేఖర్ కమ్ముల

కరోనాపై ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయని అవి పోయి, ప్రభుత్వం సమగ్ర సమాచారం అందించాలని దర్శకుడు శేఖర్ కమ్ముల కోరారు. కరోనా అవగాహన కోసం వైరస్ బారిన పడిన రైతు స్వరాజ్య వేదిక కొండల్ రెడ్డి మరియూ సాజయా కాకర్లతో ఫేస్ బుక్ లైవ్ లో శేఖర్ కమ్ముల  చర్చించారు. 

ఆయన మాట్లాడుతూ...కరోనా టెస్టుల గురించి ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. ఎక్కడెక్కడ టెస్టులు చేస్తున్నారో తెలియడం లేదు. టెస్టులు జరిగే ప్రాంతాలు ఎక్కడున్నాయో బాగా ప్రచారం చేయాలి. కరోనా గురించి జాగ్రత్తలు అవసరమే గానీ భయపడాల్సిన పని లేదు. కరోనా వచ్చిన వాళ్ల సామాజిక బహిష్కరణల గురించి వార్తలు చదువుతుంటే బాధేస్తుంది. ఇలాంటప్పుడే మనం మానవత్వం చూపించాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూనే ఇతరులకు చేతనైనంత సాయం చేయాలి. మనం లాక్ డౌన్ లో ఎంతో స్ఫూర్తిని ప్రదర్శించాం. అదే స్పూర్తిని ఇంకొన్నాళ్లు చూపించాలి. ఇలా చేస్తే ఈ మహమ్మారిపై పోరులో ప్రభుత్వానికి సహకారం అందించినట్లు అవుతుంది. ఇది అందరికీ వస్తుందని కాదు, అయినా జాగ్రత్తగా ఉండాలి. కరోనాపై అవగాహన కోసమే నేను కరోనాను గెల్చిన వారితో ఈ చర్చకు వచ్చాను. రానున్న రోజుల్లో మరింత మందితో ఇలా మాట్లాడాలి అనుకుంటున్నా. అన్నారు.

రైతు స్వరాజ్య వేదిక కొండల్ రెడ్డి మాట్లాడుతూ...మా ఇంట్లో ముందు మా మామగారికి కరోనా వచ్చింది. ఆయన వయసు 72 ఏళ్లు. అప్పటికి కిడ్నీ సమస్య వంటి అనారోగ్యాలు ఉన్నాయి. గాంధీ ఆస్పత్రికి చేర్చాం. అక్కడ బాగా చూసుకున్నారు. ఆయన డిశ్చార్చి అయి వచ్చారు. నా భార్య, బాబు, నేను హోం క్వారెంటైన్ ఉన్నాం. ఇరుగు పొరుగు ఐదారు రోజులు మాట్లాడలేదు. తర్వాత సహకరించారు. మాట్లాడారు. నా స్నేహితులు ధైర్యం చెప్పారు. 90 శాతం మంది కోలుకున్నారు ఏం కాదు అని చెప్పారు. స్నేహితుడు యాదవరెడ్డి రాత్రి ఫోన్ చేసినా వచ్చి మందులు తెచ్చి ఇచ్చాడు. కరోనా వచ్చిందంటే వాళ్ల ఇంటి దగ్గర జీహెచ్ఎంసీ వాళ్లు హడావుడి చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల వాళ్లు బయపడుతున్నారు. ఇది తగ్గిస్తే మంచిది. మేము నార్మల్ డైట్ తీసుకున్నాం. కానీ 14 రోజులు భయంగానే గడిపాం. నేను కూడా ఎవరికైనా ఇబ్బంది వస్తే సాయం చేయాలని అనుకుంటున్నా. అన్నారు.

సాజయ కాకర్ల మాట్లాడుతూ...శేఖర్ కమ్ముల అన్నట్లు సామాజిక బహిష్కరణ కొవిడ్ రోగుల పట్ల తగ్గాలి. గ్రామాల్లో ఈ భయం బాగా ఉంది. అక్కడి యువత ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం చేయాలి. వాలంటీర్లుగా ఏర్పడాలి. మనం తినే ఆహారం ఏదైనా కడుపునిండా తినాలి. భయం వద్దు ధైర్యంగా ఉండండి...అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com