దుబాయ్:ప్రవాస భారతీయుల సమస్య పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రారంభం

- August 01, 2020 , by Maagulf
దుబాయ్:ప్రవాస భారతీయుల సమస్య పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రారంభం

దుబాయ్:దుబాయ్ పరిధిలోని ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరితగతిన స్పందించేందుకు చర్యలు చేపట్టింది భారత దౌత్య కార్యాలయం. ఈ మేరకు సింగిల్ విండో ఈ-హెల్ప్ లైన్ విధానాన్ని ప్రారంభించింది.ఇవాళ్టి నుంచే ఈ సింగిల్ విండో విధానం అమలులోకి వచ్చింది. డిస్ట్రెస్ కేసెస్ తో పాటు..డాక్యుమెంటేషన్ కు సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లందరూ ఇక నుంచి తమ సమస్యలు వివరిస్తూ సింగిల్ విండో విధానం ద్వారా నేరుగా దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించొచ్చని ఇండియన్ కాన్సుల్ జనరల్ అమన్ పూరి వెల్లడించారు. ఇందుకోసం తమ అధికార వెబ్ సైట్ http://www.cgidubai.gov.inలో హెల్ప్ లైన్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక నుంచి తమ సమస్యలపై దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలనుకుంటే https://www.cgidubai.gov.in/helpline.phpకు తాము ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ లో పేరు, ఫోన్ నెంబర్, యూఏఈలో తమ చిరునామాతో పాటు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో దరఖాస్తు ఫామ్ లో స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తుదారుడు ఒక్కసారి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయగానే అతనికి ఓ యూనిక్ కోడ్ నెంబర్ వస్తుంది. ఆ కోడ్ నెంబర్ ఆధారంగానే దరఖాస్తు ఏ దశలో ఉందో చెక్ చేసుకోవచ్చు. అయితే..సమస్య పరిష్కార గడువు వారు పేర్కొనే సమస్య తీవ్రతను బట్టి ఉంటుందని దౌత్య కార్యాలయ అధికారులు వివరించారు. ఉదాహరణకు ఉద్యోగాలు కొల్పోయి, ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యను కొన్ని గంటల్లోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని..గరిష్టంగా ఓ రోజులోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదే పాస్ పోర్ట్ సంబంధిత సమస్యలను ఓ రోజులో పరిష్కారిస్తామన్నారు. ఇక వారాంతపు సెలవులు, ఇతర సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తమ సేవలు అందుబాటులో ఉంటాయని దుబాయ్ దౌత్య కార్యాలయం వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com