అయోధ్య రాముని మందిర భూమి పూజ సందర్భంగా సతీమణితో పూజ చేసిన ఉపరాష్ట్రపతి

- August 05, 2020 , by Maagulf
అయోధ్య రాముని మందిర భూమి పూజ సందర్భంగా సతీమణితో పూజ చేసిన ఉపరాష్ట్రపతి

న్యూ ఢిల్లీ:శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం.. మర్యాదపురుషోత్తముడైన శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్యం, నైతికత, సౌభ్రాతత్వం వంటి ఆదర్శ విలువలకు పున:పట్టాభిషేకం చేయడమని నేను భావిస్తున్నాను. అయోధ్యకు రాజుగా శ్రీరాముడు పాటించిన శ్రేష్ఠమైన, ఆదర్శవంతమైన జీవితం.. సమాజంలోని సామాన్యులు, ఉన్నతవర్గాలవారు అనే భేదభావాల్లేకుండా ప్రజలందరికీ అనుసరణీయంగా ఉండేవి. శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు, స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీయ చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయి. ఇవి మత, ప్రాంత విభేధాల్లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనవి. ఆ విలువలు కాలాతీతమైనవి, నేటికీ సందర్భోచితమైనవి.

రామమందిర నిర్మాణాన్ని ఒక మతపరమైన కార్యక్రమంగా కాక, ఆ ఆలోచనా పరిధుల్ని దాటి మరింత విస్తృతమైన అంశంగా చూడాలి. ఈ మందిరం ఉన్నతమైన, సనాతనమైన మానవ విలువలకు ప్రతీకగా మనకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది.  ఎలాంటి వివక్షకు తావులేకుండా మనమంతా ఒకటని తెలిపే  భారతీయ నైతిక విలువలను మనకు నిరంతరం గుర్తుచేస్తుంటుంది. 

అలాంటి అద్భుతమైన ప్రాధాన్యత గల రామమందిరానికి ఆగస్టు 5న జరిగే భూమిపూజ.. భారతీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమై శ్రీ రాముడు పాటించిన విలువల వైభవాన్ని కళ్ళకు కడుతూనే ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ వివాదంలో.. న్యాయ, శాంతిపూర్వక పరిష్కారంలో భాగస్వాములైన కక్షిదారులందరికీ పేరుపేరునా అభినందనలు తెలుపుతున్నాను. వారందరి సామూహిక కృషికారణంగానే మందిర నిర్మాణం సాధ్యమైంది. ఈ సందర్భంగా అయోధ్య స్థల వివాదంలో కక్షిదారుగా ఉన్నటువంటి  ఇక్బాల్ అన్సారీ (దివంగత  హషీమ్ అన్సారీ కుమారుడు)ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతీయ సాంస్కృతిక విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రతి ఒక్కరూ గతాన్ని మరచి ముందుకు సాగాలని ప్రజలందరికీ వారు గొప్పమనుసుతో చేసిన విజ్ఞప్తి అభినందనీయమని తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 

ఇంతటి చారిత్రకమైన ఈ రోజును.. అన్ని విశ్వాసాల పట్ల పరస్పర గౌరవం, సామరస్యపూర్వక జీవనంతో కూడిన..  కొత్త శకానికి నాందిగా భావించి ముందుకెళ్దాం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడి కలలు సాకారమయ్యే భారతావని నిర్మాణం జరగాలని కోరుకుందాం. ఈ సందర్భంగా, జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచించినట్లుగా.. ప్రజాస్వామ్య, ధర్మబద్ధమైన ఆదర్శాలతో ప్రజా శ్రేయస్సును, సమాజంలో ఆనందాన్ని ప్రతిబింబించే, సమాజంలో అందరికీ శాంతిసామరస్యాలు, సమానత్వాన్ని కల్పించే రామరాజ్య స్థాపనకు పునరంకితమవుదామని ప్రతినబూనుదాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com