ఆందోళనకరంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం..తండ్రి ఆరోగ్యంపై కుమార్తె శర్మిష్ఠ స్పందన

- August 12, 2020 , by Maagulf
ఆందోళనకరంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం..తండ్రి ఆరోగ్యంపై కుమార్తె శర్మిష్ఠ స్పందన

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనను ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కి ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు.

తన తండ్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న శర్మిష్ట ముఖర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తునట్లుగా బుధవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూనే తన ఆవేదనను ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు శర్మిష్ట ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ చేసిన ట్వీట్ లో గత సంవత్సరం ఆగస్టు 8వ తేదీన తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆరోజు తన తండ్రి భారతరత్న అవార్డును అందుకున్నారు అని గుర్తు చేశారు.

కానీ సరిగ్గా సంవత్సరానికి ఆగస్టు 10వ తేదీన ఆయన అనారోగ్యానికి గురయ్యారు అని ఆవేదన వ్యక్తం చేసిన శర్మిష్ట ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రికి బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని,ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ శర్మిష్ట ముఖర్జీ ట్వీట్ చేశారు.

2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ క్లాట్ ను తొలగిస్తూ సర్జరీ నిర్వహించారు. ఈ సర్జరీకి ముందు నిర్వహించిన వైద్యపరీక్షలలో ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో,ఆయనకు సర్జరీ చేయడం తప్పనిసరి కాగా సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు. ప్రణబ్ ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో మహామృత్యుంజయ యజ్ఞాన్ని నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు గ్రామస్తులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com