మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

- August 16, 2020 , by Maagulf
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

లక్నో:భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ తుది శ్వాస విడిచారు. 73 ఏళ్ల చౌహాన్ మృత్యువుతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. గత నెలలో కరోనా వైరస్‌ సోకడంతో చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటుండగానే తుదిశ్వాస విడిచారు. చౌహాన్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో చౌహాన్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు.

జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. వైరస్ కారణంగా అతనికి ఉన్న కిడ్నీ సమస్యలు మరింత జఠిలంగా మారాయి. పీజీఐలో అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంతకు తరలించారు. చికిత్స సమయంలోనే ఆయనకు కిడ్నీతో పాటు బీపీ సమస్య కూడా వచ్చింది. దీంతో వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు మృతిచెందారు.

భారత్ జట్టులోకి 1969లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ చౌహాన్.. 40 టెస్టులాడి 2,084 పరుగులు చేశారు. అలానే ఆడిన 7 వన్డేల్లో 153 రన్స్ చేశారు. 1981లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన చౌహాన్.. కెరీర్‌లో కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేకపోయారు. కానీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌తో సుదీర్ఘకాలం ఓపెనర్‌గా బరిలో దిగారు. గవాస్కర్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడి దాదాపు 3000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

చేతన్ చౌహాన్ అర్జున అవార్డు కూడా అందుకున్నారు. ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అతను పలు హోదాల్లో పనిచేశారు. చౌహాన్ మహారాష్ట్ర, ఢిల్లీ తరఫున రంజీల్లో ఆడారు. అతని కెరీర్‌లో 172 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లున్నాయి. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లో వెళ్లిన చేతన్ చౌహాన్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ గవర్నమెంట్‌లో క్యాబినెట్ మినిస్టర్‌గా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com