దుబాయ్:వీసా గడువు ముగిసిన వారిని భారత్ తరలించేందుకు ఇండియన్ కాన్సులేట్ స్పెషల్ డ్రైవ్

- August 30, 2020 , by Maagulf
దుబాయ్:వీసా గడువు ముగిసిన వారిని భారత్ తరలించేందుకు ఇండియన్ కాన్సులేట్ స్పెషల్ డ్రైవ్

దుబాయ్:వీసా గడువు ముగిసి...పాస్ పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు లేకపోవటంతో యూఏఈలోనే ఉండిపోయిన వారికి దుబాయ్ లోని భారత కాన్సులేట్ ఊరట కలిగించింది. సరైన డాక్యుమెంట్లు లేకుండా యూఏఈలోనే ఉండిపోయిన వారిని ఇండియా తరలించేందుకు రెండు నెలల స్పెషల్ డ్రైవ్ ను చేపట్టినట్లు భారత్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి ప్రకటించారు. కరోనా ప్రభావంతో యూఏఈలోని చాలామంది ప్రవాసీయులు ఉద్యోగాలు కొల్పోయిన విషయం తెలిసిందే. ఇంకొంత మంది ప్రవాసీయులకు వారి యాజమాన్యాలు జీతం లేని బలవంతపు సెలవులు ఇచ్చాయి. దీంతో వీసా రెన్యూవల్ చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంటికి తిరిగి వెళ్దామనుకుంటే..వేల మంది ప్రవాసీయుల పాస్ పోర్టులు వారి యాజమానులు, స్పాన్సర్ల దగ్గరే ఉండిపోయాయి. దీంతో వందేభారత్ మిషన్ ఫ్లైట్స్ లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని డాక్టర్ అమన్ పురి వివరించారు.సరైన డాక్యుమెంట్లు లేకపోవటంతో వేల మంది ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అలాంటి వారికోసమే కాన్సులేట్ కార్యాలయం ప్రత్యేక పథకం ద్వారా సరైన డాక్యుమెంట్లు లేకున్నా ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసి వారిని ఇండియా పంపించేలా చొరవ తీసుకుంటోందని తెలిపారు.

మరోవైపు మార్చి 1తో వీసా గడువు ముగిసిన వారు నవంబర్ 17 లోగా స్వదేశాలకు వెళ్లిపోతే ఎలాంటి జరిమానా చెల్లించనవరం లేదని, ఆ తర్వాత తప్పనిసరిగా ఫైన్ వసూలు చేస్తామని ప్రకటించింది. దీంతో యూఏఈ ప్రకటించిన క్షమాభిక్ష గడువులోగా యూఏఈలోని ప్రవాస భారతీయులను ఇండియా పంపించేందుకు దుబాయ్ లోని భారత కాన్సులేట్ ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. తమ సేవలు దుబాయ్ కి మాత్రమే పరిమితం చేయకుండా యూఏఈలోని ఫుజైరా, రస్ ఆల్ ఖైమా వంటి ఇతర ఎమిరేట్లోని ప్రవాసీయులకు కూడా సాయం చేస్తున్నట్లు అమన్ పురి తెలిపారు.ఇదిలాఉంటే..వందే భారత్ మిషన్ చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 3, 70,000 మంది ఇండియాకు వెళ్లినట్లు పేర్కొన్నారు. మరో 6 లక్షల మంది తిరుగు ప్రయాణానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. యితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు, హోటల్స్ తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించటంతో కొందరు ప్రవాసీయులు యూఏఈలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇండియా వెళ్లేందుకు ఇప్పటికే ఫ్లైట్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నా..తాజా పరిణామాలతో వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు అమన్ పురి వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com