NOC లేకుండానే జాబులు మారే ప్రక్రియను ప్రకటించిన ఖతార్

- September 05, 2020 , by Maagulf
NOC లేకుండానే జాబులు మారే ప్రక్రియను ప్రకటించిన ఖతార్

దోహా:పరిపాలనాభివృద్ధి, కార్మిక, సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక సంస్థలో పని చేస్తూ కొత్త ఉద్యోగానికి మారేందుకు సిద్ధపడిన కార్మికులకు ఇక నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని తెలిపింది. అయితే..అందుకు కొన్ని షరతులను కూడిన విధానాన్ని కార్మిక, సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

1. సంస్థ మారాలనుకునే కార్మికులు ముందుగా యజమానికి ADLSA ద్వారా ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ పద్దతిలో సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక నెల నోటీస్ పిరియడ్ ఉంటుంది. ఒకవేళ కార్మికుడు రెండేళ్లకు అటు ఇటుగా అదే సంస్థలో పని చేస్తున్నట్లైతే నోటిస్ పిరియడ్ రెండు నెలలు ఉంటుంది.

2. ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ సిస్టం ద్వారా అందించే సమాచారంలోనే ఎందుకు సంస్థ మారుతున్నామనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. పాత యజమాని సంతకం చేసిన  కాంట్రాక్ట్ డాక్యుమెంట్ జత పరచాల్సి ఉంటుంది. ఒక వేళ కాంట్రాక్ట్ ఫామ్ లేకుండా ADLSA ధృవీకరణ పత్రం లేదా జాబ్ ఆఫర్ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి జతపరచాల్సి ఉంటుంది.

3. సంస్థ మారుతున్నట్లు  ADLSA నుంచి కార్మికుడు, కొత్త యజమాని ఖచ్చితంగా ఎస్ఎంఎస్ రావాలి. ఎస్ఎంఎస్ వస్తేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మినహాయింపునకు అర్హులు అవుతారు.
4. కొత్త యజామాని సదరు కార్మికుడికి ఉద్యోగంలో చేర్చుకుంటున్నట్లు ADLSA కు సంస్థ ధృవీకరణ పత్రాన్ని డిజిటల్ రూపంలో పంపించాలి.

5. కొత్త యజమాని ఉద్యోగి కాంట్రాక్ట్ పత్రాన్ని ప్రింట్ అవుట్ తీసి సదరు కార్మికుడితో చర్చించి అతనితో సంతకం తీసుకోవాలి.

6. సంతకం చేసిన కాంట్రాక్ట్ ఫామ్ ను ADLSAలో అప్ లోడ్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ గుర్తింపునకుగాను 60 రూపాయలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

7. ఆ తర్వాత ఉద్యోగి కాంట్రాక్ట్ కి సంబంధించి అధికారిక గుర్తింపు రాగానే సదరు కార్మికుడు అంతర్గత మంత్రిత్వ శాఖలో కొత్త క్యూఐడీ కోసం విజ్ఞప్తి చేసుకోవచ్చు.

ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తో అవసరం లేకుండా సదరు కార్మికుడు కొత్త సంస్థలో ఉద్యోగిగా చేరవచ్చు. అంతేకాదు ఆ కార్మికుడికి కొత్త యాజమాన్యం నుంచి ఖతార్ ఐడీ కార్డు, హెల్త్ కార్డు లభిస్తుంది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com