విలువలతో కూడిన విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి:ఉపరాష్ట్రపతి
- September 11, 2020
న్యూఢిల్లీ:విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారానే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పుస్తకాలు, తరగతి గది పాఠాలతోపాటుగా.. విలువలను నేర్పించడం మన విద్యావ్యవస్థలో భాగంగా కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
శ్రీ రామచంద్ర మిషన్, ఐక్యరాజ్యసమితి సమాచార కేంద్రం (భారత్, భూటాన్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘హార్ట్ ఫుల్ అఖిలభారత వ్యాసరచన పోటీల’ను ఉపరాష్ట్రపతి శుక్రవారం అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించారు. ఏటా జూలై, నవంబర్ మధ్యలో ఐక్యరాజ్యసమితి యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ... యువత మస్తిష్కాలను ఉత్తేజితం చేసి, వారు సానుకూలంగా ఆలోచించేలా ప్రేరేపించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమ ఉద్దేశం అభినందనీయమన్నారు. ఆంగ్లంతో సహా పది భారతీయ భాషల్లో ఈ పోటీలను నిర్వహించాలన్న ఆలోచనను అభినందించారు. త్వరలో అన్ని భారతీయ భాషల్లో పోటీలు నిర్వహించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానం 2020 విలువలతో కూడిన విద్యను అందించడంపై దృష్టిపెడుతోందన్న ఉపరాష్ట్రపతి.. భారత ప్రాచీన విద్యావిధానంలో చదువుతోపాటు విలువలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తుచేశారు. నేటి సమాజంలో అలాంటి విద్యావిధానం ఆవశ్యకత చాలా ఉందన్నఆయన.. సమాచార, సాంకేతిక విప్లవం కారణంగా వేగంగా పరిగెడుతున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు ఈ దూకుడు పక్కదారి పడుతోందన్నారు. ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు మన మూలాలను, సంప్రదాయ జ్ఞాన ప్రసార పద్ధతులను గుర్తుచేసుకుంటూ.. సార్వత్రిక విలువలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాకేంద్రాలు, స్వచ్ఛందసంస్థలు విద్యార్థులకు జీవిత పాఠాలు అందించడంపై దృష్టిసారించాలన్నారు. ఈ దిశగా భారత్ పయనించగలిగితే.. విలువల ఆధారిత విద్యావిధానం ద్వారా ప్రపంచానికి మార్గదర్శనం చేయడం ఖాయమన్నారు.
కరోనా నేపథ్యంలోనూ మనోధైర్యాన్ని కోల్పోకుండా.. నైతికతను గుర్తుచేసుకుని పరస్పర సహకారంతో పనిచేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. స్వచ్ఛంద సేవలో ఉండే ఆనందం వర్ణనాతీతమని.. అందుకే ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూనే సమాజంలోని ఆపన్నులకు, బాధిత, పీడిత వర్గాలకు వీలైనంత సహాయం చేయాలన్నారు. మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, వారి గురించి ఆలోచించడం భారతీయ సంప్రదాయానికి మూలమని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మనతోపాటు ఇతరులకోసం జీవించినపుడే.. చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటామన్నారు.
మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన ఒత్తిడికి గురయ్యారని.. దీన్నుంచి బయటపడేందుకు కుటుంబంతో విలువైన సమయం గడపాలని.. యోగ, ధ్యానం లాంటివి అలవర్చుకోవాలని సూచించారు.
నేటి యువతే రేపటి నాయకులవుతారని.. అందుకే వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. విద్యతోపాటు పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ద్వారా యువతలో వినూత్న ఆలోచనలు, సృజనాత్మకతకు బీజం పడుతుందన్నారు.
శారీరక దారుఢ్యంతో మానసిక ఆరోగ్యం
అనంతరం జరిగిన మరో కార్యక్రమంలో.. పంజాబ్ యూనివర్సిటీలో జరిగిన ‘మౌలానా అబుల్ కలాం ఆజాద్’ క్రీడా పోటీల్లో వరుసగా రెండో ఏడాది ఛాంపియన్స్ గా నిలిచిన పంజాబ్ విశ్వవిద్యాలయ జట్టును అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ విశ్వవిద్యాలయ కులపతి కూడా అయిన ఉపరాష్ట్రపతి.. వర్సిటీ క్రీడలతోపాటు ఉన్నత విద్యాప్రమాణాలతో ఖ్యాతి పొందుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో క్రీడాసంస్కృతిని పునర్నిర్వచించుకుని ముందుకెళ్లడం అత్యంత ఆవశ్యకమన్నారు. దైనందిన జీవితంలో క్రీడలు, యోగ, ఇతర వ్యాయామాల ద్వారానే సరైన ఆరోగ్యంతోపాటు ఒత్తిడిలేని జీవితాన్ని గడపటం సాధ్యమవుతుందన్నారు.
విద్యార్థులు 50 శాతం తరగతి గదుల్లో.. మిగిలిన 50 శాతాన్ని మైదానంలోనో, వ్యవసాయ క్షేత్రంలోనో, సామాజిక సేవలోనో గడపడాన్ని అలవాటు చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. క్రీడల్లో రాణించడం అంత సులభం కాదని.. అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ, చిత్తశుద్ధి, ప్రణాళిక ఉండాలన్నారు. ఈ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో శిక్షకులు (కోచ్), విద్యాలయ యాజమాన్యం, ఇతర సహాయ సిబ్బంది పాత్ర కీలకమన్నారు.
విద్యార్థులు, యువత శారీరక దారుఢ్యం తద్వారా మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడంతోపాటు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడాన్ని కూడా విస్మరించరాదన్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలి వల్ల నష్టమేనని.. ఈ విషయంపై దృష్టిపెట్టి మన సంప్రదాయ ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ అంటూ ఇచ్చిన పిలుపును, కేంద్ర ప్రభుత్వం.. దేశంలో క్రీడాభివృద్ధి నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ పోటీలను ప్రశంసించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులు, యువతలో సరికొత్త స్ఫూర్తిని రగిలించాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వసతులను మెరుగుపరిచి అక్కడి ఆణిముత్యాలను వెలికి తీయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. దేశంలో ప్రతిభకు కొదువ లేదని.. దాన్ని గుర్తించి, వెలికితీసి సానబెట్టే బలమైన వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్‌కుమార్, క్రీడా విభాగం నిర్దేశకుడు, కోచ్‌లు, క్రీడాకారులైన విద్యార్థులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?