మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది--మంత్రి కొల్లు రవీంద్ర
- February 11, 2016

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. స్థానిక టౌన్ హాల్ లో బుధవారం నిర్వహించిన మత్స్యకారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయపరంగా 11 శాతం వృద్ధిరేటు నమోదైతే మత్స్య పరిశ్రమపరంగా 50శాతం వృద్ధిరేటు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యరంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల నిమిత్తం రూ.కోట్లు వెచ్చిస్తున్నా వాటి ఫలాలు మత్స్యకారులకు చేరడం లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నెలలకు ఒకసారి వారికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీటి వనరుల సద్వినియోగంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువులు తవ్వి వాటిని మత్స్యకారులకు కేటాయించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో గతంలో కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారని, తమ ప్రభుత్వం మొదటి విడతగా రూ.2 వేలను అందించిందన్నారు. భవిష్యత్తులో ఈ మొత్తాన్ని రూ.4,000 చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాలు అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా రంగాన్ని దృష్టిలో ఉంచుకుని మండల పరిధిలోని పెదపట్నం, పోలాటితిప్ప గ్రామాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారని, త్వరలో వాడపాలెం, పెదయాదర, చిన్నాపురం గ్రామాల పరిధికి కూడా విస్తరించనున్నట్టు చెప్పారు. చెరువుల మరమ్మతు విషయంలో ఇబ్బందులు పెట్టవద్దంటూ రెవెన్యూ అధికారులకు సూచించారు. బోట్ల మరమ్మతులకు ఎంపెడా ద్వారా రాయితీ అందజేస్తారన్నారు. గిలకలదిండి వద్ద సముద్ర ముఖద్వారం పూడిక పడటంవల్ల బోట్ల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ పూడిక తీత పనులు చేయిస్తామని తెలిపారు. ఇందుకు రూ.100 కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. చేపల పెంపకంలో కేజ్ కల్చర్ అమలవుతోందని, పీతల పెంపకాన్ని ప్రోత్సహించే క్రమంలో రాయితీ ఇస్తారని తెలియజేశారు. మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు మాట్లాడుతూ ఆక్వా కల్చర్ నిమిత్తం పదిహేను రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. చేపల వేట నిషేధ సమయంలో జిల్లాలో 3800 మంది మత్స్యకారులకు రూ.2,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు చెప్పారు
ప్రమాద బీమా పంపిణీ…...
కార్మికశాఖ ద్వారా ప్రైవేటు డ్రైవర్లకు అమలు చేస్తున్న ఉచిత బీమా పథకంలో భాగంగా మంజూరైన మొత్తాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఇటీవల మృతి చెందిన ఎర్రపోతు సురేష్‌కు మంజూరైన రూ.30 వేల మొత్తాన్ని అతని భార్యకు అందించారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, ఎంపీపీ వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, ఆర్డీవో సాయిబాబు, మచిలీపట్నం ఎంపీడీవో జి.వి.సూర్యనారాయణ, ఎమ్మార్వో నారదముని, ఎంపెడా అధికారి శ్రీనివాస్, మత్స్యకార సొసైటీ ప్రతినిధులు, పలువురు మత్స్యకారులు అవగాహన సదస్సులో పాలుపంచుకున్నారు.

తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







