ఎస్.పీ బాలుకు నివాళి

- October 10, 2020 , by Maagulf
ఎస్.పీ బాలుకు నివాళి

హైదరాబాద్:సంగీతం సురుల మాతృభాష కాబోలు అని అన్నారు ఓ పాశ్చాత్త సంగీతకారుడు. అది నిజమేనేమో అని ఆ సురులే తలచారో ఏమో... మనకి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ని వరమిచ్చారు.

కొన్ని గళాలు, కొన్ని గానాలు విననిదే రోజులు వ్యర్థం అనిపిస్తాయి...బహుశా అది చిన్నతనం నుండే మనం మొలకెత్తిన ముత్యాలకు అంటువేసినట్టు, ఎందరో సంగీత సార్వభౌములు సంగీతం అనే ఆసరా తీసుకుని పెరగటం వల్ల కాబోలు. కానీ మన గాన గంధర్వుని స్వరం వినని జీవనమే వ్యర్థం అనేలా ఎన్నో మరపురాని శ్రవణానుభూతులు మనకు, మన తరువాతి తరాల వారికి కూడా మిగిల్చారు.

అలాంటి ఓ సంగీతజ్యోతిని మనం కోల్పోయాం. అదే సమయం లో మహమ్మారి విరుచుకుపడుతున్న కారణంగా, ఆర్థికంగా, మానసికంగా మరెందరో సంగీతకారులు అవస్థపడుతున్నారు. మరి ఇటువంటి కష్ట కాలంలో, సంగీతాన్ని నమ్ముకుని, సంగీతమే జీవితమై బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలకి మనమంతా ఆసరా కావాలని... మన ఆర్.పీ. పట్నాయక్ , సినీ మ్యుజిషియన్స్ యూనియన్, హైదరాబాద్ వారి తరపున, బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం ఒక మహాకార్యం తలపెట్టారు.

చిత్ర,మనో,సునీత,రేవంత్,శ్రీకృష్ణ,రఘు కుంచె వంటి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో సంగీత కళాకారులతో పాటు యువ సంగీతకారులైన కప్రీసియో బృందం సహా చేరి ప్రపంచమంతా ప్రత్యక్ష ప్రాసరం చూసేలా ఎనిమిది గంటల పాటు మనల్ని సంగీత సంద్రాన పరవసించబోనున్నారు.

ఈ కార్యక్రమానికి సేకరించబడిన నిధులు మొత్తం ఈ మహమ్మారి కారణంగా అవస్థపడుతున్న ఎందరో కళాకారులకి, వారి కుటుంబాలకి మనందరి తరపునా చిరు చేయూతనివ్వడానికి ఉపయోగించబోతున్నారు.

విరాళాలు అందజేయాలనుకున్నవారు Donatekart.com ద్వారా దాతలుగా మారగలరు.
హైదరాబాద్ కు చెందిన Eleven Point Two సంస్థ ఈ కార్యక్రమాన్ని దేశం లోనే స్ట్రీమింగ్ సేవలు అందిచడం లో అగ్రశ్రేణులైన Echoes project వారి సహకారం తో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

మనమందరం ఈ సంకల్పానికి తోడ్పడి, కళాకారులైన మన సోదరులకు అండగా నిలుస్తామని, బాలు సంగీతజ్యోతి కి మనమందరం చిరుదివ్వెలమై ఈ కాంతి తో ఎన్నో జీవితాలకి వెలుగు చూపగలమని ఆశిస్తున్నాం.

ఈ కార్యక్రమానికి సంబంధించిన స్ట్రీమింగ్ లింకు క్రింద చూడగలరు.

Middle -East / South Africa / UK / Europe ( 8:30PM to 12AM IST)- https://youtu.be/zxLG7YzLnEQ
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com