సైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన జామ్‌తారా ముఠా

- October 14, 2020 , by Maagulf
సైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన జామ్‌తారా ముఠా

హైదరాబాద్‌:పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో రిమో ట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి.. లక్షలు కాజేస్తున్న జామ్‌తారా ముఠాను మంగళవారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదుగురు సభ్యుల ఈ ముఠా దేశవ్యాప్తంగా అమాయకులను బురిడీ కొట్టించి లక్షలు కాజేసింది. మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు.. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. అందులో పేటీఎం యాప్‌ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలంటే .. ఆ మెసేజ్‌లోని నంబర్‌ను సంప్రదించాలని ఉంది. దీంతో ఆ మహిళ.. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసింది. అతడు మీ ఫోన్‌లో టీమ్‌ వ్యూయర్‌ క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండని, ఆ తర్వాత ఆ యాప్‌ ద్వారా మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో మా నంబర్‌కు ఒక్క రూపాయి పంపండి.. మేము మీ పేటీఎంను అప్‌డేట్‌ చేసేస్తామన్నాడు. నిజమేనని నమ్మి ఆమె అన్ని వివరాలు చెప్పింది. క్షణాల్లో బాధిత మహిళ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ.4.29 లక్షలను కాజేశారు. దీంతో బాధిత మహిళ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మోసానికి పాల్పడిన ఐదుగురు సభ్యులు నన్‌కు మండల్‌, రాజేశ్‌ మండల్‌, శివశక్తి కుమార్‌, గౌరవ్‌ అరుణ్‌, దిల్‌ఖుష్‌ కుమార్‌ సింగ్‌లుగా గుర్తించి వారిని జార్ఖండ్‌ రాష్ట్రం జామ్‌తారా నుంచి పట్టుకుని వచ్చి మంగళవారం రిమాండ్‌కు పంపారు. సమావేశంలో డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అదనపు డీసీపీ కవిత, ఏసీపీ శ్యాంబాబు, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com