జాతీయ విద్యావిధానం 2020 అమలులో రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్-గవర్నర్

- October 16, 2020 , by Maagulf
జాతీయ విద్యావిధానం 2020 అమలులో రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్-గవర్నర్
విజయవాడ: నిజమైన స్ఫూర్తితో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు భవిష్యత్తు సవాళ్లను అధిగమించి నూతన విధానం అమలులో కీలక భూమికను పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమలుపై శుక్రవారం రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశ్వ విద్యాలయ ఉపకులపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరించందన్ కీలకోపన్యాసం చేసారు. ఉన్నత విద్యావిధానంలో సమున్నత మార్పులు తీసుకు వచ్చే క్రమంలో 'జాతీయ విద్యా విధానం 2020' పాత్రపై గవర్నర్లు, రాష్ట్ర విద్యామంత్రులతో భారత రాష్ట్రపతి నిర్వహించిన పూర్వపు సమావేశాన్ని అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో గవర్నర్ సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ జాతీయ విద్యావిధానం 2020 అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్‌గా ఉండాలని అకాంక్షించారు. ఉన్నత విద్యావ్యవస్థ యొక్క పనితీరును మెరుగు పరిచి, ఉన్నత విద్యాసంస్థలను అన్ని రంగాలలోనూ క్రమశిక్షణ కలిగిన విశ్వవిద్యాలయాలుగా మార్చడం ద్వారా దేశంలో బలమైన, శక్తివంతమైన విద్యా వ్యవస్థకు జాతీయ విద్యావిధానం 2020 మార్గం చూపిందన్నారు.  జాతీయ ప్రధాన కార్యక్రమాలైన 'ఉన్నత్ భారత్ అభియాన్', 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' కూడా జాతీయ విద్యావిధానం 2020 లో భాగంగా ఉంటాయన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయాలు ఎదుర్కుంటున్న ఆర్థిక, మోళిక, మానవ వనరుల,  పాలన సమస్యలను అధికమించవలసి ఉందన్నారు. 
 
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 అమలు ఫలితంగా దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక, సంస్థాగత, పాఠ్య సంస్కరణలు రానున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం జగన్నన్న అమ్మవడి, జగన్నన్న గోరుముద్ద వంటి కార్యక్రమాల ద్వారా విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్ధుల స్థూల నమోదు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రాధన్యం ఇస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఇపి యొక్క అనేక సిఫార్సులను అమలు చేసిందన్నారు. జగనన్న విద్య కానుక, వసతి దీవెన, అమ్మ వడి, గోరుముద్ద పథకాలతో పాటు నాడు నేడు కార్యక్రమం కింద ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు పెంపొందింప చేస్తామన్నారు. ఎన్‌ఇపి 2020 దేశ విద్యా రంగాన్ని మారుస్తుందన్న నమ్మకం ఉందని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. 
 
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, విద్యా శాఖ కమీషనర్ ఎంఎం నాయక్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రరెడ్డి, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఎన్ఇపి 2020 భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను గౌరవ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com