అమెరికా ఎన్నికలు: ప్రీ-పోల్స్ ఏమంటున్నాయి?
- November 03, 2020
ఇంటర్నెట్ డెస్క్: యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. అగ్రరాజ్యాధిపతి పీఠాన్ని అధిరోహించే అభ్యర్థి ఎవరో ప్రజలు తేల్చనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కాబోయే ఎన్నికల్లో మరో ఆరు కోట్ల మంది పోలింగ్ బూత్‌లకు తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 1900వ సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక పోలింగ్ 60 శాతాన్ని మించలేదు. దాదాపు 23.6 కోట్ల మందికి ప్రస్తుతం ఓటు హక్కు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో అభ్యర్థుల భవితవ్యంపై ఇప్పటికే పలు సంస్థలు ప్రీపోల్స్ నిర్వహించాయి. అత్యధిక సర్వేలు డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ వైపే మొగ్గుచూపినప్పటికీ.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఓటమిని మాత్రం ఖాయం చేయలేకపోయాయి.
తగ్గిన తేడా..
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా క్రమంగా తగ్గుతూ వచ్చినట్లు సర్వేలు తేల్చిన ఆసక్తికర అంశం. 'రియల్ క్లియర్ పాలిటిక్స్' గణాంకాల ప్రకారం.. గెలుపును ఖరారు చేసేవిగా భావిస్తున్న రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెన్ కేవలం 2.9 శాతం పాయింట్లతో ముందజలో ఉన్నారు. సాధారణంగా ఈ మాత్రం ఆధిక్యాన్ని మదింపు దోషం కింద తీసేస్తుంటారు. ఈ లెక్కన బైడెన్ గెలుపు అంత సునాయాసం కాదన్న విషయం స్పష్టమవుతోంది.
ట్రంప్ బృందం మెరుపు ర్యాలీలు..
బైడెన్ ఆధిక్యం గత కొన్ని రోజుల్లోనే భారీగా క్షీణించినట్లు సర్వేలు వెల్లడించాయి. దీనికి ట్రంప్‌తో పాటు ఆయన బృందం ముఖ్యంగా కుటుంబ సభ్యులు చేసిన సుడిగాలి ర్యాలీలే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజుల్లో ట్రంప్ స్వయంగా 15 ర్యాలీల్లో పాల్గొన్నారు. కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న ఫ్లోరిడా, నార్త్ కెరొలైనా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్‌లో ఐదు సభలు నిర్వహించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ సహా ఆయన కుటుంబ సభ్యులు గత మూడు రోజుల్లో ఏకంగా 40 సభల్లో పాల్గొని ఓటర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు సైతం భారీ ఎత్తున ప్రచారం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మినెసోటాలో దాదాపు లక్షా 30వేల ఇళ్లకు వెళ్లి వారిని ఓటింగ్‌కు రిపబ్లికన్లు ఒప్పించినట్లు చెబుతున్నారు. మరోవైపు డెమొక్రాటిక్ పార్టీ తరఫున బైడెన్, కమలా హారిస్, బరాక్ ఒబామా ముగ్గురూ కలిసి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, సభల నిర్వహణలో ట్రంప్ బృందాన్ని మాత్రం ఢీకొట్టలేకపోయారు.
మీడియా సంస్థలేమంటున్నాయి...
ఇక దేశవ్యాప్తంగా 'రియల్ క్లియర్ పాలిటిక్స్' అంచనాల ప్రకారం.. ట్రంప్ కంటే బైడెన్ 6.5 పాయింట్లు ముందంజలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ తేడా ఎనిమిది నుంచి తొమ్మిది పాయింట్లుగా ఉండేది. ఇక ప్రధాన మీడియా సంస్థల సర్వేలన్నీ ట్రంప్ గెలుపు కష్టమేనని అభిప్రాయపడ్డాయి. కానీ, ఓటమి మాత్రం ఖాయం అని తేల్చి చెప్పలేకపోయాయి. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ వెనుబడి ఉన్నారు కనుకనే ఆయన ఓటమి పాలవుతారని విశ్లేషించడం గమనార్హం. ఇక న్యూయార్క్ టైమ్స్ స్పందన ఇలా ఉంది. ''ఒకవేళ ముందస్తు సర్వేలన్నీ నిజమే అయితే.. జో బైడెన్ భారీ విజయం ఖాయం'' అని అభిప్రాయపడింది కానీ, ఆ 'ఒకవేళ' అన్న పదానికి చాలా ప్రాధాన్యం ఉందంటూ అనుమానాలు రేకెత్తించింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పలు సర్వేలు ట్రంప్ మీద డెమొక్రాట్ అభ్యర్థి హిలరీ క్లింటన్‌కు ఆధిక్యం చూపినా చివరకు ట్రంపే నెగ్గిన విషయాన్ని గుర్తు చేసింది. ఈసారి కూడా అలా జరగదని హామీ ఏమీ ఇవ్వలేమని అభిప్రాయపడింది. అయితే, చివరి సారి మదింపు దోషాన్ని పరిగణనలోకి తీసుకుంటే బైడెన్ విజయం తథ్యమని అంచనా వేసింది. ఇక ఫైవ్థర్టీఎయిట్.కామ్(FiveThirtyEight.Com)కు చెందిన నేట్ సిల్వర్ ప్రకారం.. ట్రంప్ గెలుపునకు పది శాతం అవకాశం ఉందని విశ్లేషించారు. ఈసారీ ఎలక్టోర్ కాలేజ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!