మస్కట్:సరైన డాక్యుమెంట్లు లేని కార్మికులు దేశం విడిచి వెళ్లేందుకు మరో అవకాశం
- November 17, 2020
మస్కట్:డాక్యుమెంట్లు లేని వ్యక్తులు, సరైన అనుమతులు లేని ప్రవాసీ కార్మికులు దేశం విడిచి వెళ్లేందుకు ఒమన్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉన్న ప్రవాస కార్మికులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 నాటికల్లా దేశం విడిచి వెళ్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒమన్ దీర్ఘాకాలిక ఆర్ధిక ప్రణాళిక-2040 అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ కార్మిక శక్తి స్థిరీకరణకు, అలాగే కార్మిక విధానాల సరళీకరణకు దోహదపడేలా ప్రస్తుత నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్షమాభిక్ష కాలాన్ని ప్రవాస కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఒమన్ కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు స్పందించిన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు...ఒమన్ లోని తమ దేశస్తులను స్వదేశానికి తరలించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి. సరైన డాక్యుమెంట్లు లేని ప్రవాస కార్మికులు, రెసిడెన్సీ, పాస్ పోర్టు గడువు ముగిసన కార్మికులు ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఇంటికి చేరుకునేందుకు ఈ క్షమాభిక్ష కాలం సరైన సమయం అని అభిప్రాయపడ్డాయి. ఒమన్ లోని ప్రవాస భారతీయుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డాక్యుమెంట్లు లేని వారిని గుర్తించేందుకు సోషల్ వర్కర్ల సాయం తీసుకుంటున్నట్లు తెలిపింది. తమ కంటే సోషల్ వర్కర్స్ సులువుగా ప్రవాస కార్మికులను గుర్తించగలరని, క్షమాభిక్షకు సంబంధించి సమాచారం చేరవేయగలరని భావిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఒమన్ ప్రకటించిన క్షమాభిక్ష అవకాశం గురించి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామని, అలాగే పాస్ పోర్టు పునరుద్ధరణ, ప్రయాణ పత్రాలను అందించటంలో ప్రవాస కార్మికులకు పూర్తిస్థాయి సాయం అందించేందుకు భారత రాయబార కార్యాలయం అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







