వాతావరణ మార్పులపై విద్యార్థి దశ నుంచే చైతన్యం తీసుకురావాలి - ఉపరాష్ట్రపతి

- November 20, 2020 , by Maagulf
వాతావరణ మార్పులపై విద్యార్థి దశ నుంచే చైతన్యం తీసుకురావాలి - ఉపరాష్ట్రపతి
చెన్నై:వాతావరణ మార్పుల ద్వారా ఎదురౌతున్న  సమస్యల నుంచి కాపాడుకునేందుకు చేపడుతున్న విధానాల్లో విద్యార్థి కేంద్రిత వ్యవస్థను కూడా చేర్చాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వివిధ వ్యూహాల అమలు, విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో బాలల హక్కులను కూడా సమ్మిళితం చేయాలని ఆయన సూచించారు.శుక్రవారం పార్లమెంటేరియన్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ సంస్థ.. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘క్లైమేట్ పార్లమెంట్ విత్ చిల్డ్రన్’ వెబినార్‌ను చెన్నై నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ప్రపంచానికే పెను సవాల్‌గా మారిన వాతావరణ మార్పు అంశంపై పార్లమెంటేరియన్లు, చిన్నారుల మధ్య అనుసంధానతను పెంచడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
 
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. వెనుకటి తరాలతో పోలిస్తే నేటి తరం చిన్నారులకు అనేక అంశాల పట్ల అవగాహన ఉంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ విషయంలో వారిని కూడా భాగస్వాములు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, దాని ప్రభావం, వాటిని తగ్గించుకోవడం లేదా భూమండలాన్ని కాపాడటం తదితరమైన మౌలిక అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన,  పాఠశాలలు, కళాశాలలనుంచే ఈ మార్పుకు శ్రీకారం జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులన్న విషయాన్ని మరవొద్దని.. అందుకే నేటి విద్యార్థులు రేపు జరగాల్సిన మార్పునకు రథసారథులని ఉపరాష్ట్రపతి తెలిపారు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి, వాతావరణ మార్పుల వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారని.. మృతుల్లో ఎక్కువశాతం చిన్నారులేనన్న (0-14 ఏళ్ల మధ్యనున్నవారు) విషయాన్ని మరవొద్దన్నారు. పౌష్టికాహార లోపం, గాయాలు, అనారోగ్యానికి చిన్నారులే ముందుగా బలవుతున్నారని తెలిపారు.
 
కరువుకాటకాలు, వరదలు, తుఫానులు, అడవుల్లో కార్చిర్చులు మొదలైన ప్రకృతి విపత్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోందన్న ఉపరాష్ట్రపతి.. కర్బన ఉద్గారాలు పెద్ద సంఖ్యలో వెలువడటమే భూ పర్యావరణానికి భారీగా నష్టం చేసిందని పేర్కొన్నారు. భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలతోపాటు వైరల్ వ్యాధులు పెరిగిపోతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆహారభద్రతకు భూతాపం సవాల్ విసురుతోందని.. తద్వారా ఆకలితో పాటు పౌష్టికాహార లోపం కూడా మానవాళిని వెక్కిరిస్తోందన్నారు. దీనికి చిన్నారులే ప్రధానంగా బాధితులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల కారణంగా పౌష్టికాహార సమస్యలు, పాఠశాలల మూసివేత, బాలకార్మికుల సంఖ్య పెరగడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి అక్కడక్కడా కనబడుతున్నాయన్నారు.
 
ఈ సందర్భంగా తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి.. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణంలో తాను పెరిగానని.. ఈ తరానికి కూడా ఇవి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. సుస్థిరాభివృద్ధి దిశగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ.. పురోగతి, ప్రకృతి మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వనరులను పరిరక్షించుకుంటూ.. తర్వాతి తరాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగేయాలన్నారు.
 
వాతావరణ మార్పులకు కారణాలను అన్వేషించి.. దుష్ప్రభావాలనుంచి కాపాడుకునేందుకు మన వద్ద మరో పదేళ్లకు మించి సమయం లేదన్న నిపుణుల సూచనలను ప్రస్తావిస్తూ... ఈ దిశగా విధాననిర్ణేతలు, నాయకులు, తల్లిదండ్రులు.. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని.. తద్వారా మన భవిష్యత్ తరాలకోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించేందుకు కృషిచేయాలని సూచించారు.
 
స్వచ్ఛభారత్ మిషన్‌లో చిన్నారులు తీసుకొస్తున్న మార్పును, వారి పాత్రను గుర్తుచేస్తూ.. ‘చిన్నారులను భాగస్వాములు చేసే ఏ పనైనా సమాజం దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా సమాజంలో కూడా మార్పునకు బీజం పడుతుంది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
 
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రకృతితో స్నేహపూర్వకంగా ఉంటూ.. మన సంస్కృతిని పాటించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ‘మన పూర్వీకులు వసుధైవ కుటుంబకం వంటి ఎన్నో విలువైన నాగరికతా విలువలను మనకు అందించారు. వాటిని మన జీవితాల్లో అమలు చేయాలి. నైతికత, విలువలకు ప్రాధాన్యతనిచ్చే మన వ్యవస్థను కాపాడుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
 
ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పారిస్ ఒప్పందంపై సంతకం, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, కర్బన ఉద్గారాలను తగ్గించడం సహా పలు కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
 
ప్లాస్టిక్ ద్వారా జరుగుతున్న కాలుష్యంపైనా మరీ ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, దాదాపు 50శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల కారణంగా సముద్ర జీవజాతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. 2022 నుంచి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 
 
చిన్నారులకోసం సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా సానుకూల మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిబద్ధతతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ (పీజీసీ) ద్వారా చిన్నారుల హక్కుల సమస్యలను లేవనెత్తిన ఎంపీ వందనా చవాన్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
 
ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, పీజీసీ కన్వీనర్ వందనా చవాన్, భారతదేశంలో యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్‌తోపాటు పలువురు ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com