భాగ్యనగర‌ ప్రజలకు సిఎం కెసిఆర్‌ శుభవార్త

- November 23, 2020 , by Maagulf
భాగ్యనగర‌ ప్రజలకు సిఎం కెసిఆర్‌ శుభవార్త

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి వాటర్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 98 శాతం మంది ప్రజలకు 20 వేల లీటర్ల నీటిని ఫ్రీగా సరఫరా చేస్తామని వెల్లడించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ధోబీఘాట్లను రిపేర్ చేస్తామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో మోటార్ వాహనాల పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.

హైదరాబాద్ నగరం ఒక అందమైన ఫ్లవర్ బొకే వంటిదని కెసిఆర్ అన్నారు. దేశంలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అని చెప్పారు. మన దగ్గర గుజరాతీ గల్లీ, పార్సీ గుట్ట, అరబ్ గల్లీ వంటివి ఉన్నాయని… బెంగాళీ, కన్నడ, తమిళ సమజాలు ఇక్కడకు వచ్చి మన సంస్కృతిలో లీనమయ్యాయని అన్నారు. త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. అధికారుల్లో బాధ్యతను పెంచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఎన్నో హైదరాబాదుకు తరలి వస్తున్నాయని తెలిపారు. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదని చెప్పారు. పుష్కలంగా మంచి నీటి సరఫరా జరుగుతోందని కెసిఆర్ చెప్పారు.

కరోనా కారణంగా దెబ్బతిన్న తెలుగు చిత్ర పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. రూ.10 కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యాజమాన్యాలు షోలు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. అంతేకాకుండా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న విధంగా సినిమా టికెట్ రేట్లు సవరించుకునేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా, జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థల తరహాలో ఉండే హెచ్ టీ, ఎల్టీ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కనీస డిమాండ్ చార్జీలను రద్దు చేశారు. కరోనాతో కుదేలైన మరో రంగం చిత్ర రంగం అని, చిత్రనిర్మాణానికి పెట్టింది పేరైన మన సినీ పరిశ్రమ పునరుద్ధరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com