మహిళలకు సరైన గౌరవంతో అన్నింటా సౌభాగ్యం: ఉపరాష్ట్రపతి
- December 04, 2020
చెన్నై:అన్నిరంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు కల్పించి గౌరవించుకున్నప్పుడే అన్నిచోట్లా సౌభాగ్యం వెల్లివిరుస్తుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోనూ మహిళలకు సరైన అవకాశాలు కల్పించి.. విధానపరమైన నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేయాల్సిన తక్షణావసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టులో 13 మంది మహిళా న్యాయమూర్తులు ఉండటంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. ఇది మరింత పెరగడం ద్వారా మహిళలు న్యాయవ్యవస్థలోకి వచ్చేందుకు స్ఫూర్తి కలిగించగలమన్నారు.
మాజీ ప్రధాని ఇంద్రకుమార్ గుజ్రాల్ జయంతి సందర్భంగా.. వారి స్మారక పోస్టల్ స్టాంపును చెన్నై రాజభవన్లో జరిగిన కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వివిధ రంగాల్లో మహిళల నాయకత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరముంది. దేశంలోనే అత్యధికంగా మద్రాస్ హైకోర్టులో 13 మంది మహిళా న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామం. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు’ అని పేర్కొన్నారు. ఈ చొరవతో పాటు సుప్రీంకోర్టులోనూ మహిళాన్యామూర్తుల సంఖ్యను పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా న్యాయ, శాసన వ్యవస్థల్లో మహిళలకు తగినంత అవకాశాలను పెంచే దిశగా అన్ని భాగస్వామ్య పక్షాలు కృషిచేయాలన్నారు.
రాజకీయాలతోపాటు ప్రజాపాలన, కార్పొరేట్ పాలన, పౌర సమాజం సంస్థల్లో భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మహిళల పాత్ర గణనీయంగా పెరగడంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ఈ దిశగా మహిళల సంఖ్య మరింతగా పెరగాలని దీనికై ప్రోత్సహించాలన్నారు. 17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. మొత్తం ఎంపీల సంఖ్యలో ఇది 14శాతం మాత్రమేనన్నారు. స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లను అమలుచేయడం ద్వారా చాలా మంది అతివలు తమ సత్తాచాటుతున్నారని వారి నాయకత్వ ప్రతిభను చాటుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది పురుషాధిక్య ప్రపంచమనే భ్రమల్లోనుంచి బయటకు వచ్చి.. మహిళలకు అవకాశాలివ్వాలన్నారు. లింగ వివక్ష ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు.
మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. గుజ్రాల్ మృదు స్వభావి, విద్యావంతుడు, మర్యాదస్తుడైన రాజకీయ వేత్త అని ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన సిద్ధాంతాలను వదలకుండా ముందుకెళ్లిన వ్యక్తి అని తెలిపారు. ‘స్నేహపూర్వకమైన వ్యక్తిత్వం, మర్యాదపూర్వకంగా వ్యవహరించే వారి తత్వంతోపాటు రాజకీయాలకు అతీతంగా అందరితోనూ సత్సంబంధాలు వారిని మరింత ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నిరాడంబరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయితగా వారి జీవిత సందేశాన్ని నేటి యువత చదివి ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో గుజ్రాల్ ప్రతిపాదించిన ‘గుజ్రాల్ సిద్ధాంతం’ను కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నవారంతా ఇతర పార్టీల వారిని ప్రత్యర్థులుగా భావించాలి తప్ప శత్రువులుగా కాదని ఉద్బోధించారు. దేశానికి సంబంధించిన అంశాల్లో వ్యక్తిగత, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ‘అన్నింటికంటే దేశమే ముందు’ అనే భావనతో పనిచేయాలని సూచించారు.
ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం ఉండే దక్షిణాసియాను ప్రతిబింబించే సార్క్ దేశాలు సమన్వయంతో పనిచేస్తూ అన్నిరంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్న ఉపరాష్ట్రపతి, ఉగ్రవాదం విషయంలో మాత్రం ఎలాంటి అలసత్వం వహించకూడదని సూచించారు. అభివృద్ధికి శాంతిపూర్వక వాతావరణం అత్యంత ఆవశ్యకమని, పొరుగుదేశాలు స్నేహపూర్వక సంబంధాలను ఏర్పర్చుకోవడం చాలా అవసరమని, దురదృష్టవశాత్తూ మన పొరుగుదేశం కొన్నేళ్లుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా ఐక్యరాజ్యసమితి మరింత చొరవతీసుకుని.. భారతదేశం ప్రతిపాదించిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు’ను నిర్వహణలో ఆలస్యం చేయకూడదని తెలిపారు. దక్షిణాసియా ప్రాంతంలో పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి వంటి సవాళ్లను పరిష్కరించుకుని అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారికి పూర్తిస్థాయిలో టీకా అమల్లోకి వచ్చేంతవరకు అలసత్వం వహించకూడదన్న ఉపరాష్ట్రపతి, ప్రభుత్వం, వైద్యులు సూచించినట్లుగా మాస్కు, సురక్షిత దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు నరేశ్ గుజ్రాల్, మాజీ ఎంపీ తర్లోచన్ సింగ్, తమిళనాడు సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.సెల్వకుమార్, తమిళనాడు సిటీ రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ సుమతి రవిచంద్రన్‌తోపాటు పలువురు ప్రముఖులు, ఐకే గుజ్రాల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







