టిబెట్‌పై కొత్త బిల్లుతో అమెరికా రెడీ..దలై లామా కు పూర్తి స్వేచ్ఛ..చైనాకు ఝలక్
- December 22, 2020
వాషింగ్టన్ : టిబెట్‌పై ఆధిపత్యం చలాయించే చైనాకు అమెరికా గట్టి ఝలక్ ఇచ్చింది. ఆధ్యాత్మిక నేతకు వారసుడి ఎంపికలో టిబెటన్ల హక్కులను అమెరికన్ కాంగ్రెస్ సమర్థించింది. టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్, 2020ని ఆమోదించి, టిబెటన్లలో సంతోషాన్ని నింపడంతోపాటు, చైనాకు ఆగ్రహం తెప్పించింది. ప్రవాస టిబెట్ ప్రభుత్వం అమెరికా చర్యను స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమని, చైనాకు గట్టి సందేశమని అభివర్ణించింది.
టిబెట్ ప్రధాన నగరం లాసాలో అమెరికన్ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లు ప్రతిపాదించింది. దలై లామాకు వారసుడిని ఎంపిక చేసుకోవడానికి టిబెటన్లకు సంపూర్ణ హక్కులు ఉన్నట్లు పేర్కొంది.
ఈ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా ప్రభుత్వ విధానం టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్, 2020 ద్వారా అధికారికంగా వెల్లడైందని పేర్కొంది. దలై లామా పునరవతారానికి సంబంధించిన నిర్ణయాలు ప్రత్యేకంగా ప్రస్తుత దలై లామా, టిబెటన్ బుద్ధిస్ట్ లీడర్స్, టిబెట్ ప్రజల అధికార పరిథిలోనే జరుగుతాయని ఈ చట్టం స్పష్టం చేసిందని పేర్కొంది. చైనా ప్రభుత్వం ఏ విధంగానైనా జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి, ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది.
దీనిపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం తీవ్రంగా స్పందించింది. తన అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. ఈ బిల్లుపై సంతకం చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేసింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది.
ధర్మశాలలో ప్రవాస టిబెటన్ ప్రభుత్వం
టిబెట్‌ను చైనా ఆక్రమించి, ఎదురు తిరిగిన టిబెటన్లను అణచివేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, అంటే 1959 ఏప్రిల్‌లో దలై లామా మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ చేరుకున్నారు. అప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు. ఆయనతోపాటు వేలాది మంది టిబెటన్లు వచ్చారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే టిబెటన్ ప్రవాస ప్రభుత్వం నడుస్తోంది. మన దేశంలో 80 వేల మందికి పైగా టిబెటన్లు ప్రవాస జీవితం గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, యూరోపులలో ఉన్నారు.
టిబెటన్లు పాటించే బౌద్ధాన్ని దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. 14వ దలై లామా పునరవతారాన్ని గుర్తించేందుకు ప్రక్రియను ప్రారంభించింది. దలై లామా వారసుడిని ఆమోదించే అధికారం తమకే ఉందని చెప్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







