ప్రజాజీవితంలో ఉన్న వారిలో నైతికత, విలువల పతనంపై ఉపరాష్ట్రపతి ఆవేదన

- December 26, 2020 , by Maagulf
ప్రజాజీవితంలో ఉన్న వారిలో నైతికత, విలువల పతనంపై ఉపరాష్ట్రపతి ఆవేదన

హైదరాబాద్:ప్రజాజీవితంలో ఉన్నవారిలో నైతికత, విలువల పతనం పట్ల ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా పతనం కాకముందే, అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యుల్లో, వ్యవస్థలో నైతికతను, విలువలను పెంపొందించేందుకు కృషిచేయాల్సిన తక్షణావసరం ఉందని ఆయన సూచించారు. తద్వారా స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహించాలన్నారు.

హైదరాబాద్‌లో ‘ప్రజాస్వామ్య ఏకాభిప్రాయ నిర్మాణం – వాజ్‌పేయి మార్గం’ ఇతివృత్తంతో ‘ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన మూడవ అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీ తమ కార్యకర్తలు, పార్టీ తరపున ఎన్నికైన చట్టసభ్యులు ప్రతిఅడుగులోనూ నైతికంగా జీవించేలా చొరవతీసుకోవాలని సూచించారు. రాజకీయ, చట్టసభల్లో జరిగే చర్చల్లోనూ ప్రమాణాలను పెంచేలా, ఉత్తమ ప్రవర్తనను కనబరిచేలా ప్రోత్సహించాలన్నారు.

అధికారం కోసం అంగబలాన్ని, అర్థబలాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఓ సిద్ధాంతమనేది లేకుండా.. విలువల్లేకుండా రాజకీయాలు సాగుతుండటం వంటి పలు పెడధోరణులు  మంచివి కాదని హితవు పలికిన ఉపరాష్ట్రపతి, నేరప్రవృత్తి గల వారు రాజకీయాల్లోకి రావడం కారణంగా హింస పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ అనావశ్యక విధానాలు, పద్ధతులను పక్కన పెట్టకపోతే భవిష్యత్తులో భారత రాజకీయ వ్యవస్థకు కోలుకోలేని నష్టం జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ముందుగానే ఈ విషయంలో జాగ్రత్తపడాలి’ అని సూచించారు.

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినంగా, ప్రభావవంతంగా అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, చట్టసభల ప్రిసైడింగ్ అధికారులు.. పార్టీ ఫిరాయింపుల వివాదాలను దీర్ఘకాలం పెండింగ్ లో ఉంచకుండా.. మూడు నెలలలోపే విచారించేలా చొరవతీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం ప్రజా ప్రతినిధులకు తగదని హితవు పలికారు. ఫిరాయింపుల చట్టం లోని లొసుగులను తొలగించాలని, ‘సౌకర్యవంతమైన రాజకీయాలు’ అనే విధానానికి స్వస్తి పలికి.. శ్రీ అటల్ జీ చూపించిన ‘విశ్వాస వంతమైన రాజకీయాలు’ను, ‘రాజకీయ ఏకాభిప్రాయం’ నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. 

ఇటీవలి కాలంలో రాజకీయాల్లో, అధికారంలో దీర్ఘకాలం ఉండాలన్న లక్ష్యంతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ విధానాన్ని పక్కనపెట్టి దీర్ఘకాలంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందడుగేయాలని సూచించారు. 

దీర్ఘదృష్టిగల రాజనీతిజ్ఞుడైన వాజ్‌పేయి జీవితాన్ని నేటి యువత, రాజకీయాల్లోకి రావాలనుకునే వారు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, అవినీతి, వర్ణ, లింగ, కుల వివక్ష, మహిళలపై హింసతోపాటు పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

 వాజ్‌పేయి గారికి నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. అటల్ జీ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రధానమంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నిష్కళంకమైన వ్యక్తిత్వం, ఉన్నతస్థాయి నైతిక విలువలు, తను నమ్మిన సిద్ధాంతం, విలువల విషయంలో రాజీపడని తత్వంతోపాటు.. నిరాడంబరత, గౌరవ, మర్యాదలను కలబోసిన మహోన్నత వ్యక్తిత్వంతో శ్రీ వాజ్‌పేయి గారు ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. అటల్ జీ, అద్వానీజీ తన గురువులన్న ఆయన, వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 

పార్టీలకు అతీతంగా అందరి నుంచి ప్రశంసలు పొందిన వ్యక్తి వాజ్‌పేయి అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రజాజీవితంలో ఇలాంటి వ్యక్తులు బహు అరుదుగా తారసపడతారన్నారు. అటల్ జీ సుదీర్ఘ పార్లమెంటరీ జీవితాన్ని ప్రస్తావిస్తూ.. ‘వారి ఆలోచనలు, భాషాపటుత్వం, వాగ్ధాటి, మాటల్లో కాఠిన్యంతోపాటు చమత్కారం, కవి హృదయం, జాతీయవాదం.. ఇలా ఏ కోణంలో చూసినా అటల్‌ జీ భారత రాజకీయ యవనికపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు’ అని తెలిపారు. అంతటి మహనీయుడు చూపిన బాటను, ఆచరించిన విలువలను కొనసాగించడమే ఆయనకిచ్చే గొప్ప నివాళి అని పేర్కొన్నారు.
తొలి కాంగ్రేసేతర ప్రధానిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి సంకీర్ణ రాజకీయాలను విజయవంతంగా, సమర్థవంతంగా నడిపించిన ‘వికాస్ పురుష్’ అటల్ జీ అని గుర్తు చేసిన  ఉపరాష్ట్రపతి, సంకీర్ణ విధానాలతో ముందుకెళ్లడమంటే, తన సిద్ధాంతాల విషయంలో రాజీ పడినట్లు కాదనే విషయాన్ని కూడా అటల్ జీ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేవారన్నారు. 1999లో రెండోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయంలో తీవ్రమైన ఒత్తిడిలోనూ.. తన విలువలతో రాజీ పడబోనని సుస్పష్టం చేసి, ప్రధాని పీఠాన్ని త్యాగం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
ఆర్థిక సంస్కరణ విషయంలోనూ అటల్ జీ తీసుకొచ్చిన మార్పులను ప్రస్తావించిన  ఉపరాష్ట్రపతి, పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టాన్ని తీసుకురావడం, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, అనుసంధానత పెంచడం, ఉచిత ప్రాథమిక విద్యను అందించడం వంటివి వారి సంస్కరణాభిలాష, దూరదృష్టికి మచ్చుతునకలని తెలిపారు. చరిత్రాత్మకమైన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలకు సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణం, సమాచార మౌలికవసతులను ప్రోత్సహించడం ఓ అద్భుత ఘట్టంగా అభివర్ణించిన ఆయన, భారతదేశ ఆర్థిక చరిత్రలో వాజ్‌పేయి గారి పాలన సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ఆ పథకం అమలులో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

‘ప్రతి వ్యక్తికి సాధికారత కల్పించడమంటే యావద్భారతానికి సాధికారత కల్పించినట్లే. వేగవంతంమైన ఆర్థిక ప్రగతి, వేగవంతమైన సామాజిక వికాసంతోనే సాధికారత సాధ్యమవుతుంది’ అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధం వంటివి దేశ రక్షణ, ప్రాదేశిక సమగ్రత విషయంలో శ్రీ వాజ్‌పేయిగారి చిత్తశుద్ధి, అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. యావత్ ప్రపంచం ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనా.. దేశ భద్రత విషయంలో రాజీపడలేదన్నారు. 
దేశంలో తలెత్తుతున్న సమస్యలకు చర్చలే అంతిమపరిష్కారమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రగతి మంత్రమైన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ను ప్రస్తావించారు. అటల్‌జీ చూపించిన ప్రభుత్వ సమగ్రాభివృద్ధి, ప్రజాస్వామిక సుపరిపాలన అంశాలను మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యుడు శౌర్య దోవల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు రాంమాధవ్ తోపాటు వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొందరు అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com