అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ కార్యక్రమానికి ఎంపికైన GMRVF విద్యార్థినులు

- December 30, 2020 , by Maagulf
అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ కార్యక్రమానికి ఎంపికైన GMRVF విద్యార్థినులు

హైదరాబాద్: అమెరికా విదేశాంగ శాఖ స్పాన్సర్ చేసే కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం (CCIP) కింద జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) నిర్వహిస్తున్న విద్యాసంస్థలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అమెరికాలో తమకు నచ్చిన కోర్సులను అభ్యసించే అవకాశాన్ని పొందారు. 

బెహెరా మౌనిక, సోపేటి హేమశ్రీ తమ కలల కోర్సులను అభ్యసించడానికి త్వరలో అమెరికా వెళ్లనున్నారు. ఈ ఇద్దరు విద్యార్థినులు GMR గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన జీఎంఆర్వీఎఫ్ నిర్వహిస్తున్న రాజాంలోని SGCSR కాలేజీలో రెండవ సంవత్సరం గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఈ ఏడాది CCIPలో పాల్గొనడానికి ఇటీవల హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ జనరల్ మౌనిక, హేమలను ఎంపిక చేసింది.

అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని CCIP కింద, ఇతర దేశాల నుండి అర్హులైన అభ్యర్థులు ఏదైనా ఒక అమెరికన్ కమ్యూనిటీ కాలేజీలో ఒక సంవత్సరం చదువుకోవచ్చు. ఈ కార్యక్రమం కింద కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జీఎంఆర్‌విఎఫ్ ఉచిత శిక్షణ, మార్గదర్శకాలను అందించింది. ఎంపిక చేసిన అభ్యర్థుల కోర్సు సంబంధిత ఖర్చులు, విమాన ఛార్జీలు, బోర్డింగ్ లాడ్జింగ్, పుస్తకాలు, వైద్య సహాయం తదితర ఖర్చులను అమెరికన్ ప్రభుత్వమే భరిస్తుంది. అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.

మౌనిక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక పేద కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి మత్స్యకారుడు. గిఫ్టెడ్ చిల్డ్రన్ కార్యక్రమం క్రింద మూడవ తరగతిలో ఉన్నప్పటి నుండి GMRVF ఆమె విద్యలో సహాయం అందించింది. గిఫ్టెడ్ చిల్డ్రన్ పథకం కింద సమర్థత కలిగిన పిల్లలను గుర్తించి, ప్రోత్సహిస్తారు. మౌనిక ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని చదువులో రాణించింది. ఆమె రెండవ సంవత్సరం గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు,  CCIPకి దరఖాస్తు చేసుకోవాలని GMRVF ప్రోత్సహించింది. ఆమె ఈ సంవత్సరం CCIP ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలలో ఉత్తీర్ణురాలైంది. ఆమె CCIP 2020-2021 కింద ‘ఎన్విరాన్‌మెంటల్ హార్టికల్చర్’ కోర్సును ఎంచుకుంది. అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ డుపేజ్‌లో ఆమె చదువుకోనుంది. 

హేమ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేస్తూ, ఇంట్లో టైలరింగ్ పని కూడా చేస్తారు. ఫౌండేషన్ సిబ్బంది ఆమెలోని సామర్థ్యాన్ని గమనించి, CCIP కార్యక్రమంలో ప్రవేశానికి వీలు కల్పించారు. హేమ ‘సస్టైనబుల్ అగ్రికల్చర్’ కోర్సును ఎంచుకుంది. ఆమె అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్, ఓర్లాండోలోని వాలెన్సియా కాలేజీలో చదువుకోబోతోంది.

ఈ సంవత్సరం కోవిడ్ -19 కారణంగా ప్రవేశాలు కొంచెం ఆలస్యం అయినందున ఇద్దరు అభ్యర్థులూ 2021 జనవరిలో తమ కోర్సులలో చేరనున్నారు. 

ఈ ఇద్దరు విద్యార్థినుల ఎంపికపై, డాక్టర్ అవనీష్ కుమార్, డైరెక్టర్-కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం, జీఎంఆర్‌వీఎఫ్ మాట్లాడుతూ, “విద్యార్థులు అడ్డంకులను అధిగమించి, తమ కలలను నిజం చేసుకోవడానికి GMRVF సహకారం అందిస్తుంది. CCIPకి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తగిన శిక్షణ అందించి, వారు అమెరికా కోర్సులలో ప్రవేశం పొందడంలో విజయం సాధించేందుకు అవసరమైన మద్దతు ఇస్తుంది. ఈ కోర్సులు విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, వారి జీవితంలో మార్పుకు దోహదపడతాయి.’’ అన్నారు. 

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌తో భాగస్వామ్యం కలిగిన జిఎంఆర్‌విఎఫ్, 2015 నుండి CCIP కార్యక్రమం ద్వారా తెలుగు విద్యార్థులు అమెరికాలో చదవడానికి వీలు కల్పిస్తోంది. ఈ ఇద్దరు విద్యార్థులతో, ఇప్పటివరకు  జీఎమ్‌ఆర్‌విఎఫ్ ద్వారా CCIP కి ఎంపికైన విద్యార్థుల సంఖ్య 10 కి చేరుకుంది. అమెరికాలో కోర్సులు పూర్తి చేసి తిరిగి వచ్చిన ఇద్దరు విద్యార్థులు సుప్రసిద్ధ సంస్థలలో ఉపాధి పొందగా, మిగతా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com