ప్రవాసి భారతీయ దివస్ సందర్బంగా గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో గల్ఫ్ భరోసా దీక్ష

- January 09, 2021 , by Maagulf
ప్రవాసి భారతీయ దివస్ సందర్బంగా గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో గల్ఫ్ భరోసా దీక్ష

తెలంగాణ:తెలంగాణ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గల్ఫ్ వలసకార్మికుల సంక్షేమానికి చర్యలు  తీసుకోవాలని కోరుతూ ప్రవాసి భారతీయ దివస్ సందర్బంగా గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో శనివారం (09.01.2021) నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల "గల్ఫ్ భరోసా దీక్ష" చేపట్టారు. అంతకు ముందు తన స్వగ్రామం తాండ్రలో  తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశిర్వాదం తీసుకొని దీక్షకు బయలుదేరాడు. 

మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి 1915 జనవరి 9 తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని 2003 నుండి భారత ప్రభుత్వం ప్రతిఏటా ప్రవాసి భారతీయ దివస్‌ను నిర్వహిస్తున్నది. ప్రవాసి భారతీయ దివస్ అంటే కేవలం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ధనవంతులైన ప్రవాసీల జాతర నిర్వహిస్తున్నారని స్వదేశ్ విమర్శించారు. గల్ఫ్ తదితర దేశాలలో పనిచేస్తున్న ప్రవాసి కార్మికుల సమస్యలు, సంక్షేమమంపై చర్చకు ఇందులో అవకాశం కల్పించలేదని ఆయన విమర్శించారు.  

వచ్చే అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టి,  తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, రూ. 500 కోట్ల బడ్జెటును కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని స్వదేశ్ డిమాండ్ చేశారు. ఆరు అరబ్ దేశాలకు వెళ్లే గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

కోటపాటి నరసింహం నాయుడు, రుద్ర శంకర్, గుగ్గిళ్ల రవిగౌడ్, సేపూరి గోపాల్, అమరకొండ తిరుపతి, మహ్మద్ హసన్, రాజలింగు, శేఖర్ గౌడ్, మెంగు అనిల్, దీకొండ అనిల్, వేముల రమేష్, జంగం బాలకిషన్,బాబు స్వామి, న్యాయవాది వెంకట మహేందర్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. 

డిమాండ్లు:

  • వలస కార్మికుల కోసం సమగ్ర సామాజిక భద్రత (జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్, వాపస్ వచ్చినాక పునరావాసం) కల్పించాలి. 
  • ఎమిగ్రేషన్ చట్టం-1983 ను సమీక్షించి, దాన్ని మరింత బలోపేతం చేయడానికి సమగ్రమైన ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ చట్టం చేయాలి. 
  •  విదేశాలలోని భారత రాయబార కార్యాలయాల సామర్థ్యాలని బలోపేతం చేసి విస్తరించాలి. విదేశాలలోని భారత వలసదారులను నమోదు చేయడం, హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి భారత రాయబార కార్యాలయాలు కృషి చేయాలి.
  • విదేశాలకు వెళ్లేముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగిన శిక్షణ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టబద్దం చేయాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలి
  •  విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే టర్మినల్స్ లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  •  ఉద్యోగాల నియామక ప్రక్రియలో అనుసరించే ప్రామాణిక విధానాలు పాటించి వలస కార్మికుల రిక్రూటింగ్ వ్యవస్థను అజమాయిషీ చేయాలి. 
  • రాష్ట్రాలలో ప్రవాస భారతీయుల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, పరిపాలన శాఖలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం సలహా ఆదేశం ఇవ్వాలి.
  • సమర్థవంతమైన పాలన కొరకు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కొరకు కమిటీలను ఏర్పాటు చేయాలి.
  • వలస కార్మికుల హక్కుల రక్షణ కొరకు ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు సమర్థవంతంగా అమలు చేయుటకు భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలతో తగిన ఏర్పాట్లు చేయాలి. 
  • ప్రవాస భారతీయులకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. 
  • వలసలు మరియు అభివృద్ధి అనే విషయంపై సార్క్, కొలంబో ప్రాసెస్, అబుదాబి డైలాగ్, జిఎఫ్ఎండి లాంటి అంతర్జాతీయ వేదికలపై వేదికలపై భారత ప్రభుత్వం చురుకుగా పాలుపంచుకోవాలి.
  • వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణ గురించి ఐక్యరాజ్య సమితిలో 30 ఏళ్ల క్రితం 1990 లో చేసిన తీర్మానాన్ని భారత ప్రభుత్వం ఆమోదించాలి. ఇంటి పనివారలకు గౌరవప్రదమైన పని అనే నినాదంతో ఐక్యరాజ్య సమితిలో చేసిన సి-189 తీర్మానాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించాలి. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com