ట్రంప్ ప్రభుత్వపు ఇమ్మిగ్రేషన్ చట్టానికి చెక్: బైడెన్

- January 10, 2021 , by Maagulf
ట్రంప్ ప్రభుత్వపు ఇమ్మిగ్రేషన్ చట్టానికి చెక్: బైడెన్

వాషింగ్టన్‌: తాను దేశాద్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే ఇమ్మిగ్రేషన్ బిల్లును చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైన 100 రోజుల్లో ఇమ్మిగ్రేషన్ చట్టంలో పూర్తి మార్పులు తీసుకొస్తామని బైడెన్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఇమ్మిగ్రేషన్ చట్టంపై తమ ప్రభుత్వం అనుసరించే వైఖరిని వెల్లడించారు. సంబంధిత ఇమ్మిగ్రేషన్ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టిన తర్వాత కమిటీల్లో చర్చలు జరిపి, త్వరితగతిన చట్టరూపం కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న క్రూరమైన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని పూర్తిగా పక్కన బెడతామని బైడెన్ తెలిపారు. అమెరికాలో ఆశ్రయం పొందేందుకు అనుమతి పొందిన వారిపైనా ప్రస్తుత ట్రంప్ సర్కార్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసింది.

అమెరికన్లకు ఉద్యోగ భద్రత పేరిట ట్రంప్‌.. నిపుణులకు మాత్రమే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమలు చేసింది. అయితే, తాము అధికారం చేపట్టిన వెంటనే.. భూతాప నివారణకు జరిగిన అంతర్జాతీయ ఒప్పందం.. పారిస్ ఒప్పందంలో సభ్యదేశంగా మారుతామని బైడెన్ వివరించారు. వంద రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com