అలెర్ట్..అలెర్ట్...ఐస్‌క్రీమ్ లోనూ కరోనా.. వేల డబ్బాల్లో వైరస్!

అలెర్ట్..అలెర్ట్...ఐస్‌క్రీమ్ లోనూ కరోనా.. వేల డబ్బాల్లో వైరస్!

బీజింగ్: కరోనా వైరస్‌ ఇప్పటివరకూ మనుషుల నుంచి వ్యాప్తి చెందుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే వాదన రుజువయ్యింది. చైనాలోని ఓ ఐస్‌క్రీమ్ కంపెనీకి సంబంధించిన 3 రకాల ఐస్‌క్రీమ్‌లలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐస్‌క్రీమ్ నమూనాలను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ ఫలితం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

చల్లని ఉష్ణోగ్రత కారణంగా కరోనావైరస్ ఐస్ క్రీంలో జీవించగలిగిందని మరియు వ్యాధి ఉన్న వ్యక్తి నుండి బదిలీ చేయబడిందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనాలోని పలు ప్రాంతాల్లో కలకలం మొదలైంది. అధికారులు అప్రమత్తమయ్యారు.

టియాంజిన్ మునిసిపాలిటీలోని టియాంజిన్ డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన ఐస్‌క్రీముల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. మొత్తం 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో వైరస్ ఉందని కనుగొన్నారు. వాటిలోని 2,089 డబ్బాలను ఇప్పుడు స్టోరేజ్‌లో ఉంచి సీల్ చేశారు. చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ కలిగిన 1,812 డబ్బాలను మరో ప్రాంతానికి తరలించారు. మరో 935 డబ్బాలు స్థానిక మార్కెట్‌లోకి ప్రవేశించాయి. 65 డబ్బాలు ఇప్పటికే విక్రయమయ్యాయి. అయితే ఇక్కడి ఐస్‌క్రీమ్‌లను ఎవరు తిన్నారు.? ఎంతమంది తిన్నారు.? అన్న వాటిపై ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. వీటిని తిన్నవారిలో ఇప్పటివరకు ఎవరికైనా వైరస్ సోకిందా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా వైరస్ బయటపడిన ఐస్‌క్రీమ్ సంస్థను సీజ్ చేయడంతో పాటు అక్కడ పనిచేస్తున్న 1662 మంది ఉద్యోగులను హోం ఐసోలేషన్‌కి పంపించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఎంతమందికి కరోనా వైరస్ సోకిందనే విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదని, కరోనా వైరస్ ఇంత మొత్తాన్ని వ్యాపించడానికి సదరు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో సరైన పారిశుధ్యం పాటించకపోవడం, శానిటేషన్ చేయకపోవడమే కారణమని అధికారులు నిర్ధారించారు.

ఈ ఘటనపై యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫెన్ గ్రాఫిన్ స్పందించారు. ఐస్‌క్రీమ్ డబ్బాలలో కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించిందని, ఫలితంగా ఐస్‌క్రీమ్ ప్రొడక్షన్ ప్లాంట్ అంతా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐస్‌క్రీమ్ అనేది ఫ్యాట్‌తో తయారవుతుంది. దానిని కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతారు. దీంతో అక్కడ వైరస్ వేగంగా వృద్ధి చెందిన ఉంటుందని చెప్పారు.

Back to Top