బైడెన్ హయాంలో మనవాళ్లదే హవా

బైడెన్ హయాంలో మనవాళ్లదే హవా

వాషింగ్టన్‌: త్వరలోనే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న జో బైడెన్ ప్రభు్త్వంలో ఇండియన్-అమెరికన్‌లదే హవా. ఇప్పటి వరకూ తన ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను 20 మంది ఇండియన్‌-అమెరికన్లకే బైడెన్ అప్పగించడం గమనార్హం. దేశ జనాభాలో కేవలం ఒక శాతంగా ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇన్ని కీలక పదవులు దక్కడం ఇదే తొలిసారి. ఈ 20లో 17 వైట్‌హౌజ్‌లోనే కావడం మరో విశేషం. అమెరికా తొలి వైస్ ప్రెసిడెంట్‌గా ఓ మహిళ (కమలా హారిస్‌) ప్రమాణం చేయనుండటమే ఓ రికార్డు అయితే.. కొత్త ప్రభుత్వంలో ఇంతమంది ఇండియన్‌-అమెరికన్లు ఉండటం మరో రికార్డు.

మహిళలకే పెద్ద పీట
ఇందులోనూ బైడెన్ మహిళలకే పెద్ద పీట వేశారు. 20 మందిలో 13 మంది మహిళలే కావడం విశేషం. ఇక ఈ 20 మందిలో ఇద్దరికి చాలా శక్తివంతమైన పదవులు లభించాయి. అందులో ఒకరు నీరా టాండన్‌. ఆమెను వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్‌కు డైరెక్టర్‌గా బైడెన్ నియమించారు. ఇక డాక్టర్ వివేక్ మూర్తిని యూఎస్ సర్జన్ జనరల్‌గా నామినేట్ చేశారు. ఇక వనితా గుప్తాకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అసోసియేట్ అటార్నీ జనరల్ పదవి దక్కింది. ఫస్ట్ లేడీ కాబోతున్న జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా.. ఫస్ట్ లేడీ డిజిటల్ డైరెక్టర్ ఆఫ్ ద ఆఫీస్‌గా గరిమా వర్మ, ఫస్ట్ లేడీ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్‌లను బైడెన్ నియమించారు.

ఇద్దరు కశ్మీరీలకు..
తొలిసారి ఇండియన్‌-అమెరికన్లలో ఇద్దరు కశ్మీర్ మూలాలు ఉన్న వ్యక్తులు కూడా ప్రభుత్వంలో చోటు సంపాదించారు. ఇందులో ఒకరు ఐషా షా. ఈమె వైట్ హౌజ్ డిజిటల్ స్ట్రేటజీ ఆఫీస్‌లో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా నియమితులయ్యారు. మరొకరు సమీరా ఫాజిలి. ఈమె యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఇందులోనూ మరో ఇండియన్ అమెరికన్ భరత్ రామ్మూర్తి కూడా డిప్యూటీ డైరెక్టర్‌గా ఉంటారు. గతంలో వైట్‌హౌజ్‌లో పని చేసిన గౌతమ్ రాఘవన్‌.. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఏడాదిగా బైడెన్ శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తున్న వినయ్ రెడ్డికి డైరెక్టర్ స్పీచ్‌రైటర్ పదవి దక్కింది. ఇక అధ్యక్షుడికి అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా యువకుడైన వేదాంత్ పటేల్ వ్యవహరించనున్నారు. ఇక ఎంతో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ముగ్గురు ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. తరుణ్ చాబ్రా, సుమోనా గుహ, శాంతి కళాతిల్ ఇందులో కీలకమైన బాధ్యతలు చేపట్టనున్నారు.

Back to Top