రోగులు, వృద్ధులకు హోం క్వారంటైన్ అర్హత...జాబితా అప్ డేట్ చేసిన ఖతార్

- January 20, 2021 , by Maagulf
రోగులు, వృద్ధులకు హోం క్వారంటైన్ అర్హత...జాబితా అప్ డేట్ చేసిన ఖతార్

దోహా:విదేశాల నుంచి వచ్చే వారు ఎవరు హోటల్ క్వారంటైన్ లో ఉండాలి...ఎవరెవరికి మినహాయింపు ఉంటుందనే వివరాలతో ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్ డేట్ జాబితాను విడుదల చేసింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే పౌరులు, ప్రవాసీయులతో పాటు పర్యాటకులు హోటల్ క్వారంటైన్ లో ఉండాలని నిబంధన అమలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానాశ్రయాల దగ్గర అందుబాటులో ఉన్న హోటల్స్ ను ఎంపిక చేసి వాటి వివరాలను కూడా గతంలోనే ప్రకటించింది. అయితే..గతంలో కంటే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతుండటం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావటంతో విదేశాల నుంచి వచ్చే వాళ్లందరూ హోటల్ క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చింది. రోగులు, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స పొందుతున్న వారు, వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు, మైనర్లు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్న వారికి హోటల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఖతార్ ఆరోగ్య శాఖ పేర్కొన్న వారు హోం క్వారంటైన్ లో ఉండొచ్చు.

హోం క్వారంటైన్ కు అర్హులు:
65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, గర్భిణిలు, 5 ఏళ్లలోపు చంటిపిల్లలు ఉన్న తల్లులు, రోజువారి కార్యకలాపాలకు కూడా ఇతర వ్యక్తులపై ఆధారపడే వారు, వికలాంగులు, మానసిక రోగులు, మూర్ఛ రోగులు, మైనర్లు హోం క్వారంటైన్ కు అర్హులు. అలాగే అవయవ మార్పిడి, బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్, రోగనిరోధక శక్తి సంబంధించి థెరపి, దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధి ఉన్నవారు, కిడ్నీ రోగాలతో డయాలసిస్ తీసుకుంటున్న వారు, డయాబెటిక్ ఫుట్, ఉబ్బసం, న్యూరోపి, రెటీనా వ్యాధిగ్రస్తులు, చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు హోం క్వారంటైన్ లో ఉండొచ్చని వెళ్లడించింది. అయితే..ప్రయాణానికి ముందే 'మైహెల్త్' పేషెంట్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలిపే మెడికల్ రిపోర్ట్ చూపించాలి. ప్రయాణానికి 72 గంటలలోపు చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు హమద్ మెడికల్ కార్పోరేషన్ లేదా ప్రైమరీ హెల్త్ కేర్ కార్పోరేషన్ వెబ్ సైట్ల ద్వారా నిర్ధారణ సర్టిఫికెట్లు పొందవచ్చు.

ఇక పర్యటన నిమిత్తం ఖతార్ కు వచ్చే వారికి మాత్రం హోం క్వారంటైన్ కు అవకాశం లేదు. వాళ్లంతా తప్పకుండా హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిందే. అలాగే దేశం నుంచి ఇతర దేశాలకు బంధువులతో వెళ్లి..తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చిన వాళ్లు కూడా తప్పనిసరిగా హోటల్ క్వారంటైన్ లో ఉండాలి. అయితే..హోం క్వారంటైన్ అర్హుల జాబితాను, హోటల్ క్వారంటైన్ పాలసీని ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకొని మార్పులు చేర్పులు చేయనున్నట్లు ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com