కువైట్లో పరాక్రం దివస్..నేతాజీకి భారత రాయబారి నివాళులు

కువైట్లో పరాక్రం దివస్..నేతాజీకి భారత రాయబారి నివాళులు

కువైట్ సిటీ:భారత స్వాతంత్ర్య పోరాటంలో అసమాన ధైర్యాన్ని, పోరాట మటిమను చాటిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని..కువైట్లోని భారతీయ సమాజం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పరాక్రమాన్ని స్మరించుకుంటూ ఆయన జయంతిని రోజున ప్రతి యేటా పరాక్రం దివస్ గా నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ భారీ చిత్రపటానికి రాయబారి సిబి జార్జ్ పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ సేవలను సర్మించుకున్న సిబి జార్జ్..భారతీయ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దేలా నేతాజీ యువతకు స్పూర్తినిచ్చారని ఆయన కొనియాడారు. ఎవరికి తలొగ్గని ధీరత్వం, దేశం కోసం నిస్వార్ధ సేవను భారత సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెన్నుచూపకుండా పోరాటడం, నిరాశలో కుంగిపోకుండా ఉత్సాహవంతంగా పోరాడేలా ఆయన యువతకు చూపిన మార్గం ఇప్పటికీ స్పూర్తిదాయకమని ప్రశంసించారు. పరాక్రం దివస్ పురస్కరించుకొని ఈ ఏడాది పొడగునా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశామని..ప్రసంగాలు, క్విజ్ పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Back to Top