నీకెందుకు రాజకీయాలు అన్నారు : శతృఘ్న సిన్హా

- February 24, 2016 , by Maagulf
నీకెందుకు రాజకీయాలు అన్నారు : శతృఘ్న సిన్హా

: తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నా ఒక లక్ష్యంతో ముందుకెళ్లానని, ఆ కారణంగానే సినీ పరిశ్రమ నుంచి కేంద్ర మంత్రి పదవిని పొందే అవకాశాన్ని దక్కించుకున్నానని బాలీవుడ్‌ సినీనటుడు, భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శతృఘ్న సిన్హా తెలిపారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ఆయన జీవిత చరిత్రతో కూడిన 'ఎనీథింగ్‌ బట్‌ ఖామోష్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. భారతీ ఎస్‌ ప్రధాన్‌ రచించిన ఈ పుస్తకాన్ని శతృఘ్న సిన్హాతో కలసి రాజ్యసభ సభ్యులు చిరంజీవి, సుబ్బరామిరెడ్డి, సినీనటులు మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, ఓం పుస్తక పబ్లిషర్స్‌ డైరెక్టర్‌ అజయ్‌, రచయిత్రి అంజూ పొద్దార్‌ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. తన సోదరులు ముగ్గురు వైద్యులేనన్నారు. తాను మాత్రం కాంపౌండర్‌ను కూడా కాలేకపోయనన్నారు. అయితే, అనుకోని విధంగా దేశానికే ఆరోగ్యశాఖ మంత్రినయ్యే అవకాశం దక్కిందని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సమయంలోనూ తన భార్య సోదరుడైన సుభాష్‌ఘయ్‌ రాజకీయాలు అవసరమా? ఎందుకోసమంటూ ప్రశ్నించారని వెల్లడించారు. సినీనటుడు, ఎంపీ చిరంజీవి మాట్లాడుతూ.. తామిద్దరి జీవితాలకు సామీప్యం ఉందని వివరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ.. రజనీకాంత్‌, అంబరీష్‌, శతృఘ్న సిన్హాలతో తమకు దాదాపు 40ఏళ్ల అనుబంధం ఉందన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఒక గొప్ప వ్యక్తి జీవితగాథను ఇక్కడ ఆవిష్కరించుకొంటున్నందుకు తనకెంతగానో సంతోషంగా ఉందన్నారు. పుస్తక రచయిత్రి భారతీ మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని రాసి విడుదల చేయడానికి తనకు ఏడేళ్లు పట్టిందన్నారు.శతృఘ్న సిన్హా నటనకు అభిమానులం: శైలజాకిరణ్‌ యుక్తవయసులో ఉన్నప్పటి నుంచి శతృఘ్న సిన్హా నటనను ఎంతో అభిమానించేవాళ్లమని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ తెలిపారు. ఆయన ఆహార్యం దక్షిణాది నటుడిగానే కనిపించడం వల్ల ఎక్కువగా ఇష్టపడటానికి ఓ కారణం కావచ్చన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకంలోని ఒక అధ్యాయంలో ''రాజకీయాలు ఫిజిక్స్‌ కంటే కష్టమైనవ''ని శతృఘ్న సిన్హా పేర్కొనడం ఎంతో అద్భుతమైన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆరోగ్యమంత్రిగా ఉన్న సమయంలో లింగ నిర్ధరణ పరీక్షలను నిషేధించి ఆడపిల్లలను కాపాడటంలో శతృఘ్న సిన్హా సఫలీకృతులయ్యారని కితాబునిచ్చారు. పొగాకు నియంత్రణ కోసం పోరాడుతున్నారంటూ ఆయనను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com