మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఉపరాష్ట్రపతి

- February 05, 2021 , by Maagulf
మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఉపరాష్ట్రపతి

• మాతృభాషను కాపాడుకుంటేనే, సంస్కృతిని కాపాడుకోగలం

• ఉపరాష్ట్రపతిని కలిసిన పలు విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులు

న్యూఢిల్లీ:మాతృభాష పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరి మీద  ఉందని, అమ్మ భాషను కాపాడుకునేందుకు అధ్యాపకులు మొదలుకుని తల్లిదండ్రుల వరకూ అందరి కృషి అవసరమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు.

ఈ రోజు  వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు తెలుగు భాషా ఆచార్యులు గౌరవ ఉపరాష్ట్రపతిని, ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయాల స్థాయిలో తెలుగు భాష అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల గురించి చర్చించిన ఆయన, ఆచార్యులకు సలహాలు, సూచనలు అందజేశారు.

మాతృభాషను కాపాడుకుంటేనే సంస్కృతిని కాపాడుకోగలమన్న ఉపరాష్ట్రపతి, ఇందు కోసం ప్రభుత్వాలు చేపట్టే చర్యలతో పాటు, ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేలా చూడాలని వారికి సూచించారు. తల్లిదండ్రుల దగ్గర ఈ మార్పు మొదలు కావాలన్న ఆయన, తెలుగు భాష పట్ల ఈ తరం విద్యార్థులు మక్కువ పెంచుకునేలా చూడాలన్నారు. ఇందు కోసం తెలుగు ఆచార్యులు, తమ అనుభవాన్ని ఉపయోగించి వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 


బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆచార్యులు  బూదాటి వెంకటేశ్వర్లు, మద్రాస్ విశ్వవిద్యాలయ ఆచార్యులు సంపత్ కుమార్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు  విజయలక్ష్మి, ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు సుబ్బారావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు అరుణకుమారి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు వెలుదండ నిత్యానందరావు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com