హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ACI వరల్డ్ ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు

- February 09, 2021 , by Maagulf
హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ACI వరల్డ్ ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు

హైదరాబాద్/న్యూఢిల్లీ: జీఎంఆర్ విమానాశ్రయాలు నిర్వహిస్తున్న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐఎ), హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ)లకు ACI వరల్డ్ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) వారి “వాయిస్ ఆఫ్ కస్టమర్” గుర్తింపు లభించింది.

2020లో కోవిడ్-19 సమయంలో ప్రయాణీకుల అభిప్రాయాలను సేకరించి, వారి అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ రెండు విమానాశ్రయాలకూ ఈ గుర్తింపు లభించింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా అవసరం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకు గాను హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ఈ గుర్తింపు లభించింది.

కోవిడ్ -19 ప్రపంచంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేయగా, అందులో ఎక్కువగా ప్రభావితమైనది విమానయాన రంగం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల నమ్మకాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో, పరిస్థితులకు అనుగుణంగా సురక్షితమైన ప్రయాణానికి మెరుగైన చర్యలను అమలు చేయడానికి GMR హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు నిరంతరం ప్రయాణీకుల అభిప్రాయం తెలుసుకుంటూ అన్ని రకాల కృషీ చేసాయి.  

హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు రెండూ ఆయా విమానాశ్రయాలలో కాంటాక్ట్‌లెస్ ఎలివేటర్లు, కాంటాక్ట్‌లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్‌లు, డిజిటల్ లావాదేవీలు, షాపింగ్ కోసం యాప్ బేస్డ్ టెక్నాలజీలు, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి హోయి యాప్, ప్యాసింజర్ బ్యాగేజ్ యొక్క యువీ శానిటైజేషన్, క్యాబ్‌ల పరిశుభ్రత, గాలి శుభ్రతను పెంచడానికి HEPA ఫిల్టర్లు వంటి అనేక చర్యలు చేపట్టారు.

అనేక సంవత్సరాలుగా దేశీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఇ-బోర్డింగ్ సదుపాయం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం, విమానాశ్రయ కార్యకలాపాల పున:ప్రారంభం అనంతరం దానిని అంతర్జాతీయ ప్రయాణీకులకూ విస్తరిస్తోంది. 

IGI విమానాశ్రయంలో సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తున్నారని నిర్ధారించడానికి, DIAL XOVIS ప్యాసింజర్ ట్రాకింగ్ సిస్టమ్ (PTS) ను ఉపయోగించుకుంది.  24x7 సోషల్ మీడియా కమాండ్ సెంటర్ ఢిల్లీ విమానాశ్రయంలో కీలకంగా మారింది. ఇది ప్రయాణీకుల అవసరాలను తెలుసుకుని, అవసరంలో ఉన్న ప్రయాణికులకు సహాయం అందించింది. అంతర్జాతీయ ప్రయాణీకులు పొందగలిగిన క్వారంటైన్ మినహాయింపు విధానాలను తెలుసుకోవడానికి ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ సువిధా పోర్టల్‌ను కూడా ప్రారంభించింది.

ఇవే కాకుండా రెండు విమానాశ్రయాలలో తరచూ క్రిమిసంహారక చర్యలు చేపట్టడానికి, సామాజిక దూర నిబంధనలను కఠినంగా పాటించడానికి, డీప్ క్లీనింగ్ వంటి చర్యల కోసం అనేక మంది నిపుణుల బృందాన్ని నియమించారు.

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఇఓ శ్రీ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ “ఇలాంటి క్లిష్ట సమయాలలో వీలైనంత త్వరగా ప్రయాణీకుల సమస్యలకు పరిష్కారాలను సాధించడం మా లక్ష్యం. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో ఈ గుర్తింపు లభించడం మాకు దక్కిన అరుదైన గౌరవం. ఇది ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో మొత్తం విమానాశ్రయ భాగస్వాముల కృషికి, నిబద్ధతకు నిదర్శనం” అన్నారు.

విదేహ్ కుమార్ జైపురియార్, సీఈఓ, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, ‘‘విలువలతో కూడిన సౌకర్యాలు, సేవల ద్వారా ప్రయాణీకులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మేం ఎల్లప్పుడూ కృషి చేస్తాము. ప్రయాణీకుల భద్రత కోసం గత ఏడాది విమానాశ్రయంలో అనేక చర్యలను చేపట్టాము. ఢిల్లీ విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి మేము మా వంతు ప్రయత్నం చేసాము. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి మేం చేస్తున్న కృషికి  ఈ ACI గుర్తింపు ఒక కొలమానం. ఈ విజయాన్ని సాధించిన ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు.’’ అన్నారు.

ప్రపంచ విమానాశ్రయాల వాణిజ్య సంఘం అయిన ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ) 1991లో స్థాపించబడింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్, ది సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సహా సభ్య విమానాశ్రయాలు, ప్రపంచ విమానయాన రంగంలోని ఇతర భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. విధాన అభివృద్ధి ముఖ్య దశలలో విమానాశ్రయాల ప్రయోజనాలను కాపాడడం, సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణపరంగా సుస్థిరమైన ప్రపంచ వాయు రవాణా వ్యవస్థను నెలకొల్పడానికి ACI గణనీయమైన కృషి చేస్తుంది.

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) 2020 మార్చిలో ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) డిపార్చర్ అవార్డులను ప్రకటించగా, వాటిలో జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలు రెండూ  ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్’ మరియు ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాంబియన్స్ బై సైజ్’ అవార్డుల ట్రోఫీలను అందుకున్నాయి. ASQ అనేది ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయలలో ప్రయాణీకుల సేవ, విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని కొలిచే బెంచ్ మార్కింగ్ కార్యక్రమం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com