పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ గా తమిళిసై ప్రమాణస్వీకారం

- February 18, 2021 , by Maagulf
పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ గా తమిళిసై ప్రమాణస్వీకారం

పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిరణ్‌ బేడిని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వీ నారాయణస్వామి, ఇతర మంత్రులు హాజరయ్యారు. కిరణ్‌బేడి 2016 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేశారు. పుదుచ్చేరిలో కిరణ్‌బేడి సహా నలుగురు మహిళలు లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి. 

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కిరణ్‌ బేడిని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 2016లో కేంద్రప్రభుత్వం నియమించింది. అయితే నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఎల్జీకి పేచీలు మొదలయ్యాయి. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలుగా ఇద్దరు భాజపా వ్యక్తులను నియమించడం మొదలుకుని.. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఉచిత బియ్యం, చీరల పంపకాన్ని అడ్డుకోవడం వంటివి వివాదానికి కారణమయ్యాయి. తమ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో కిరణ్‌ బేడి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, ఆమెను తొలగించాలంటూ సీఎం స్వయంగా దీక్షకు దిగారు. వారం క్రితం రాష్ట్రపతిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఎల్జీ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com