దుబాయ్: పీసీఆర్ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ట్రావెల్ ఏజెన్సీ సీజ్

- February 20, 2021 , by Maagulf
దుబాయ్: పీసీఆర్ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ట్రావెల్ ఏజెన్సీ సీజ్

దుబాయ్:కోవిడ్ కట్టడి కోసం ప్రయాణాలు, ఉద్యోగులు విధులకు హజరయ్యేందుకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు తప్పనిసరి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాల్లో పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను అమ్మకాలకు పెట్టింది ఓ ట్రావెల్ ఏజెన్సీ. దుబాయ్ లో సేవలు అందిస్తున్న ఆ ట్రావెల్ ఏజెన్సీ..ఓ ల్యాబరేటరీ సౌజన్యంతో వాట్సాప్ ద్వారా పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను జారీ చేస్తూ వస్తోంది. ఇందుకోసం ఇంటిదగ్గరికే వచ్చి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. అయితే..ఓ వినియోగదారుడు ట్రావెల్ ఏజెన్సీ సేవలు, ఇంటి దగ్గరికి వచ్చి పరిశీలించిన విధానం సరిగ్గా లేవంటూ దుబాయ్ హెల్త్ అథారిటీ, వాణిజ్య నియంత్రణ విభాగానికి ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన వాణిజ్య నియంత్రణ విభాగం వెంటనే ట్రావెల్ ఏజెన్సీ ఆఫీసును పరిశీలించి విచారణ చేపట్టారు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా వినియోగదారుల వివరాలు, పాస్ పోర్ట్ కాపీ తీసుకొని ఆ తర్వాత ఆన్ లైన్ ద్వారా టెస్ట్ ఫీజు
వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. కోవిడ్ సమయంలో సమాజ ఆరోగ్య భద్రతకు హాని కలిగించేలా వ్యవహరించటంతో పాటు చట్టాలకు విరుద్ధంగా పీసీఆర్ టెస్ట్ రిపోర్టులను జారీ చేస్తున్నారనే ఆరోపణలతో ట్రావెల్ ఏజెన్సీ మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రావెల్ ఏజెన్సీతో లింక్ అయిన ల్యాబరేటరీ వివరాలను దుబాయ్ ఆరోగ్య శాఖ యంత్రాగానికి అందించామని వెల్లడించారు. యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి అనుమతి పొందిన ఆరోగ్య సంస్థలు, ల్యాబరేటరీలకు మాత్రమే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను జారీ చేసేందుకు అర్హత ఉందని స్పష్టం చేశారు అధికారులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com