కూలిన తెలంగాణ అసెంబ్లీ పాత భవనం గోడ.. భద్రతా సిబ్బంది పరుగులు

కూలిన తెలంగాణ అసెంబ్లీ పాత భవనం గోడ.. భద్రతా సిబ్బంది పరుగులు

పెద్ద శబ్ధంతో గోడ విరిగిపడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.రెండు మూడు రోజుల క్రితం వరకు ఇక్కడ మరమ్మత్తు పనులు జరిగాయి. కానీ ఇవాళ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాంతో అసెంబ్లీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం అసెంబ్లీ భవనం పాత గోడ కూలిపోయింది. తూర్పు వైపున ఉన్న ప్రాకారం అంచు విరిగిపోయింది. పెచ్చులు భారీ శబ్ధంతో గార్డెన్ ఏరియాలో పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ముప్పుతప్పింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. పెద్ద శబ్ధంతో గోడ విరిగిపడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం వరకు ఇక్కడ మరమ్మత్తు పనులు జరిగాయి. కానీ ఇవాళ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాంతో అసెంబ్లీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

అసెంబ్లీ పాత భవనంలో కొన్ని రోజులుగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. గోడలకు రంగులు వేయడంతో పాటు దెబ్బతిన్న గోడలను మరమ్మతు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ గోడ కూలడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దెబ్బ తిన్న గోడ తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయానికి చెందినదని అసెంబ్లీ సిబ్బంది తెలిపారు.

అసెంబ్లీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ పాలనలో ఈ భవనాన్ని నిర్మించారు. 1905లో పనులు ప్రారంభమైతే.. 1913 డిసెంబర్‌ నాటికి భవన నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపు 8 ఏళ్లు పట్టిందన్న మాట. ప్రజల నుంచి చందాలు సేకరించి భవనాన్ని నిర్మించారు. చివరకు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో అసెంబ్లీ భవనం అందుబాటులోకి వచ్చింది. మొదట ఈ భవనాన్ని 'మహబూబియా టౌన్‌హాల్‌' పేరుతో పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో అసెంబ్లీగా మారింది. ఐతే ప్రస్తుతం పాత భవనంలో కాకుండా కొత్త భవనంలో తెలంగాణ అసెంబ్లీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ అసెంబ్లీ, సచివాలయం భవనాలు పాతబడడంతో వాటి స్థానాల్లో కొత్త భవనాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోనే కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. ఇక ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు గత ఏడాదే భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

Back to Top