ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం స్పూర్తితో ఇండియా కూడా..

ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం స్పూర్తితో ఇండియా కూడా..

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టంతో స్ఫూర్తి పొందిన ఇండియ‌న్ న్యూస్‌పేప‌ర్స్ అసోసియేష‌న్ కూడా ఇప్పుడు గూగుల్‌ను ప‌రిహారం అడుగుతోంది. త‌మ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు గూగుల్ త‌న యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాల‌ని ఇండియ‌న్ న్యూస్‌పేప‌ర్స్ సొసైటీ (ఐఎన్ఎస్‌) డిమాండ్ చేస్తోంది. దేశంలోని వెయ్యి ప‌త్రిక‌లు ఈ సొసైటీలో ఉన్నాయి. తాము వేలాది మంది జ‌ర్న‌లిస్టుల‌కు జీతాలు చెల్లిస్తూ ఇస్తున్న వార్త‌ల‌కు గూగుల్ ప‌రిహారం ఇవ్వాల‌ని ఈ సొసైటీ స్ప‌ష్టం చేసింది. న్యూస్ వాడుకుంటున్నందుకు ప‌త్రిక‌ల‌కు డ‌బ్బులు చెల్లించాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. 

అదే దారిలో ఇప్పుడు భార‌త వార్తాప‌త్రిక‌లు కూడా వెళ్తున్నాయి. తాము ఎంతో ఖ‌ర్చు చేసి ఇస్తున్న విశ్వ‌స‌నీయ స‌మాచారాన్ని గూగుల్‌కు మొద‌టి నుంచీ ఇస్తున్నామ‌ని ఐఎన్ఎస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఏడాది కాలంగా ఇందులోనూ త‌మ‌కు వాటా ఇవ్వాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు ప‌త్రిక‌లు గూగుల్‌ను డిమాండ్ చేస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఐఎన్ఎస్ ప్ర‌స్తావించింది. ఈ మ‌ధ్యే ఫ్రాన్స్‌, యురోపియ‌న్ యూనియ‌న్‌, ఆస్ట్రేలియాలోనూ ప‌రిహారం చెల్లించ‌డానికి గూగుల్ అంగీక‌రించింద‌ని కూడా తెలిపింది. ప‌త్రిక‌లు ప్ర‌ధానంగా యాడ్స్‌పైనే ఆధార‌ప‌డ‌తాయ‌ని, అయితే డిజిట‌ల్ స్పేస్‌లో మాత్రం మెజార్టీ వాటాను గూగుల్ తీసుకుంటోంద‌ని ఆరోపించింది.

Back to Top