ఇరాన్‌లో శవానికి కూడా ఉరి.!

- February 26, 2021 , by Maagulf
ఇరాన్‌లో శవానికి కూడా ఉరి.!

టెహ్రాన్:ఆమె ఓ హంతకురాలు. భర్తను చంపిన కేసులో ఉరిశిక్ష పడింది. ఉరికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉరికంబం ఎక్కే క్రమంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి శిక్ష అమలు చేశారు. ఈ అమానుష ఘటన ఇరాన్‌లో చోటుచేసుకుంది. జహ్రా ఇస్మాయిలీ అనే మహిళ భర్తను చంపిన నేరానికి జైలుపాలైంది. ఆమె హత్య చేసినట్టు నిరూపితం కావడంతో కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె భర్త ఇరాన్ ఇంటెలిజెన్స్ శాఖలో అధికారి. తనను, కుమార్తెను దూషిస్తుండడంతో జహ్రా ఇస్మాయిలీ భర్తను హత్య చేసింది. 

ఇదిలా ఉంటే జహ్రా కంటే ముందు 16 మంది దోషులను ఉరితీశారు. తన ముందే వారందరూ విలవిల్లాడుతూ మరణించడం ఆమె కళ్లారా చూసింది. గుండె పగిలి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ తన మృతదేహాన్ని ఉరికంబం ఎక్కించారు. జహ్రా మృతదేహాన్ని వేలాడదీశారు. అయితే, ఆమె అత్త మాత్రం తన కుమారుడిని చంపిన కోడలిపై కసితో రగిలిపోయింది. జహ్రా చనిపోయినప్పటికీ ఆమె కూర్చున్న కుర్చీని తన అత్త తన్నేయడంతో ఉరితీత పూర్తయింది. ఇరాన్‌లో ఉరిశిక్ష పడిన దోషుల ఉరితీతలో పాల్గొనేందుకు బాధితుల బంధువులను అనుమతిస్తారు. ఉరికంబం దగ్గర దోషులు కూర్చున్న కుర్చీని తన్నేసే హక్కు వారికి లభిస్తుంది. తద్వారా తమకు న్యాయం జరిగిందన్న భావనతో పాటు, తమ చేతులతోనే దోషిని చంపామన్న తృప్తి కూడా లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com