గల్ఫ్ కు మానవ అక్రమరవాణా చేస్తున్న ఏజెన్సీపై సీబీఐ విచారణ జరపాలి
- March 02, 2021
తెలంగాణ:గల్ఫ్ కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ ఏజెంట్ల స్వార్థం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన పేద కార్మికులకు అందుబాటులోకి రావడం లేదు. ప్రవాసి పాలసీ జారీ కానందున ఒక లక్ష రూపాయల విలువైన వైద్య సహాయం నష్టపోయిన కొక్కెరకాని పోశన్న అనే గల్ఫ్ కార్మికుడి వేదన చెందుతున్నాడు.
భారత ప్రభుత్వం నుండి లైసెన్సు పొందిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కార్తీక్ ఇంటర్నేషనల్ అనే గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకులు అమాయకులైన గల్ఫ్ కార్మికులను విజిట్ వీసాలతో దుబాయికి పంపిస్తూ మోసం చేస్తూ మానవ అక్రమరవాణాకు పాల్పడుతున్నారని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల మంగళవారం (02.03.2021) జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
తమకు జరిగిన అన్యాయంపై సిబిసిఐడి, సిబిఐతో పోలీసు దర్యాప్తు లేదా ఇతర పరిశోధన విభాగాలతో విచారణ చేయించాలని ఆమె కోరారు. తాను గత సంవత్సరం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, విచారణ కోసం జిల్లా ఎస్పీని ఆదేశించినా పోలీసులు స్పందించలేదని ఆమె అన్నారు.
దుబాయ్లో పక్షవాతానికి గురై సంవత్సరం క్రితం స్వదేశానికి తిరిగివచ్చిన తన భర్త కొక్కెరకాని పోశన్న ఒక లక్ష రూపాయల విలువైన వైద్య సహాయం పొందలేకపోవడానికి కారణం ఏజెన్సీ నిర్వాహకులేనని ఆమె అన్నారు.తన భర్త వైద్య ఖర్చులు, ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారంగా మారిందని ఆమె వాపోయింది.
ఐసిఆర్ పాస్ పోర్టు కలిగిన తన భర్త కొక్కెరకాని పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ,ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమాపొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు. జగిత్యాలకు చెందిన తండ్రీ కొడుకులైన ఇద్దరు గల్ఫ్ ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద రూ.68 వేలు తీసుకొని కొక్కెరకాని పోశన్నను దుబాయ్కి విజిట్ వీజాపై పంపి మోసం చేశారని, ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టబద్దంగా ఎంప్లాయిమెంటు వీజాపై ఎమిగ్రేషన్ క్లియరెన్స్ చేసి పంపిఉంటే రూ.1 లక్ష విలువైన వైద్య సహాయం లభించి ఉండేదని ఆమె అన్నారు. చట్టబద్దంగా వ్యాపారం చేయాల్సిన లైసెన్సు కలిగిన గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ 'విజిట్ కం ఎంప్లాయిమెంటు' పద్దతిలో మానవ అక్రమరవాణాకు పాల్పడటం ఘోరమని ఆమె అన్నారు.
జిల్లా కలెక్టర్ తోపాటు, జిల్లా ఎస్పీ, విదేశీ వ్యవహాల మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (PGE), హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (POE) కు కూడా ఆమె ఫిర్యాదులు పంపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష